న్యూఢిల్లీ: భారతదేశం సహా 180 దేశాలలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను ప్రచురించే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF)సంస్థ ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్ జాబితాను ప్రచురించింది. ఇందులో రెండు భారతీయ సంస్థలైన అదానీ గ్రూప్, హిందూత్వ వెబ్‌సైట్ ఓపీఇండియా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ ఏటా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఇందులో భారతదేశం 180 దేశాలలో 151వ స్థానంలో ఉంది.
‘ప్రెడేటర్స్’ జాబితాలో… “జర్నలిస్టులను చంపడం, సెన్సార్ చేయడం, జైలులో పెట్టడం, దాడి చేయడం, వార్తా మాధ్యమాన్ని అణచివేయడం, జర్నలిజాన్ని కించపరచడం, ప్రచార ప్రయోజనాల కోసం సమాచారాన్ని తారుమారు చేసే వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వాలు ఉన్నాయి.
కాగా, గౌతమ్ అదానీ నడిపే అదానీ గ్రూప్, హిందూత్వ ప్రచార వెబ్‌సైట్ OpIndiaను ‘ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్’గా RSF గుర్తించింది.
ప్రపంచ ప్రిడేటర్లలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, జి జిన్‌పింగ్ అధిపతిగా ఉన్న సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో వంటి ప్రముఖులు ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హయాంలో దాదాపు 220 మంది జర్నలిస్టుల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), మయన్మార్ స్టేట్ పీస్ అండ్ సెక్యూరిటీ కమిషన్, కెప్టెన్ ఇబ్రహీం ట్రయోరే నేతృత్వంలోని బుర్కినా ఫాసో మిలిటరీ జుంటా, జర్నలిస్టులను వేధించడానికి తన సోషల్ మీడియా Xని ఉపయోగించే బిలియనీర్ ఎలోన్ మస్క్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
కాగా, అదానీ దేశంలో రెండవ అతిపెద్ద ధనవంతుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడు అని RSF పేర్కొంది. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు “స్వతంత్ర పత్రికలను మూయించే లక్ష్యంతో, పౌర, క్రిమినల్ పరువు నష్టం దావాలు, గ్యాగ్ దావాలను క్రమబద్ధంగా ఉపయోగించడంలో భాగంగా 2017 నుండి 15 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా సంస్థలపై సుమారు 10 చట్టపరమైన చర్యలు తీసుకున్నాయని” అది పేర్కొంది.
అంతేకాదు అదానీ “హిట్ లిస్ట్”లో ఎనిమిది మంది జర్నలిస్టులు, మూడు మీడియా సంస్థలపై రెండు సివిల్, క్రిమినల్ పరువు నష్టం గ్యాగ్ దావాలు ఈఏడాది నమోదైనట్లు కూడా తెలిపింది. వీటిలో ఏ కంటెంట్ ‘పరువు నష్టం కలిగించేది’ అనేది తదుపరి విచారణ లేకుండానే స్వయంగా నిర్ణయించుకునే హక్కును కోర్టు అదానీ గ్రూప్‌కు ప్రసాదించింది.
ఈ ఉత్తర్వులు మూడవ పక్షాలకు కూడా వర్తింపజేశారని, ఇది “అపరిమిత సెన్సార్‌షిప్‌కు అవకాశం” కల్పిస్తుందని ఆర్ఎస్‌ఎఫ్ తెలిపింది.
ఈ కేసులు నమోదైన వెంటనే, ది వైర్, న్యూస్‌లాండ్రీ, హెచ్‌డబ్ల్యు న్యూస్, స్వతంత్ర జర్నలిస్ట్ రవీష్ కుమార్‌లపై కంటెంట్ తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్యాగ్ సూట్‌లను దుర్వినియోగం చేయడం అదానీ గ్రూప్ “అత్యంత ప్రమాదకరమైన ఆయుధం”అని ఆర్‌ఎస్‌ఎఫ్ తన నివేదికలో పేర్కొంది.
ఇక హిందూత్వ ప్రచార వెబ్‌సైట్ OpIndia‘కుట్ర సిద్ధాంతాలను’…‘ప్రాణాంతక ఆయుధం’గా ఆర్ఎస్‌ఎఫ్ అభివర్ణించింది. ప్రెడేటర్స్ జాబితాలో ఓపీఇండియాను చేర్చడంపై ఆర్‌ఎస్‌ఎఫ్ సంస్థ మాట్లాడుతూ…‘2025లో పత్రికా స్వేచ్ఛపై దాడి చేసేవారు సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడం ద్వారా జర్నలిస్టుల స్వేచ్ఛను మరింత పరిమితం చేశారు. ఓపీఇండియా దీనికి ఒక ఉదాహరణ.
“ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై పదేపదే దాడులకు హిందూ జాతీయవాద వెబ్‌సైట్ OpIndia ప్రసిద్ధి చెందింది. OpIndia కంటెంట్ తనను తాను “ఉదారవాద మీడియా కార్టెల్” అని చెప్పుకునే పోరాటంలో భాగంగా చెప్పుకుంటోంది. ట్రోల్ నెట్‌వర్క్‌ల సహాయంతో, ఇది విమర్శనాత్మక జర్నలిస్టులను , మీడియా సంస్థలను కించపరిచే లక్ష్యంతో కథనాలను వ్యాప్తి చేస్తుంది. తరచుగా వారు “భారత్ వ్యతిరేక లాబీ”లో భాగమని ఆరోపిస్తుంది.
కాగా, 2025లో జర్నలిస్టులు, మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఓపీఇండియా 96 కథనాలను ప్రచురించింది. ఉన్నాయి. ఇందులో కుట్ర సిద్ధాంతాల ఆధారంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “కథనా యుద్ధం” చేస్తోందని 200 పేజీల “నివేదిక” ప్రచురించింది.
స్వతంత్ర మీడియా సంస్థ ది న్యూస్ మినిట్ సహ వ్యవస్థాపకురాలు,ఎడిటర్ ధన్య రాజేంద్రన్…’ ప్రైజ్ ఫర్ ఇంపాక్ట్’కు నామినేట్ అయినట్లు RSF ప్రకటించిన తర్వాత, అక్టోబర్ 23న OpIndiaలో ఆమెపై పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురితమైందని ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను ప్రచురించే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) పేర్కొంది.


