బెంగళూరు: గత మూడు సంవత్సరాలలో కర్ణాటక ప్రజలు సైబర్ మోసాల వల్ల రూ.5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటివరకు పోలీసులు రూ.627 కోట్లు రికవరీ చేయగలిగారని హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. శాసనసభలో సకలేశ్పూర్ బిజెపి ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. “ఇటీవలి కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో, కర్ణాటకలో సుమారు 52 వేల సైబర్ మోసాలు జరిగాయి,ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని” పరమేశ్వర అన్నారు.
పోలీసు చట్టాలకు పదును పెట్టడం ద్వారా ప్రభుత్వం సైబర్ మోసాలను అరికట్టాలని ప్రణాళిక వేసిందని ఆయన శాసనసభలో చెప్పారు. అయితే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ సవరణపై కోర్టు స్టే పొందింది. ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. “ఇది డిసెంబర్ 19కి వాయిదా పడిందని” ఆయన జోడించారు. 2023లో 22,000 సైబర్ మోసం కేసులు నమోదైతే, పరిమిత సంఖ్యలో మాత్రమే గుర్తించారని, దీనివల్ల రూ.873 కోట్ల నష్టం వాటిల్లిందని, అందులో రూ.177 కోట్లు రికవరీ అయ్యాయని పరమేశ్వర పేర్కొన్నారు.
గత ఏడాది 2024లో జరిగిన సైబర్ మోసాల వల్ల దాదాపు 22,400 కేసులలో రూ.2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అధికారులు రూ.300 కోట్లకు పైగా రికవరీ చేశారని ఆయన అన్నారు. 2025లో, ప్రభుత్వ చర్యల ఫలితంగా సైబర్ మోసం కేసులు దాదాపు 13వేలకి తగ్గాయని, నష్టాలు రూ.2,000 కోట్లకు వచ్చాయని, ఇప్పటివరకు రూ.125 కోట్ల రికవరీలు జరిగాయని మంత్రి అన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక సైబర్ వర్టికల్ను సృష్టించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక అని కూడా పరమేశ్వర తెలిపారు.
“సైబర్ మోసానికి వ్యతిరేకంగా కర్ణాటక పెద్ద పోరాటం చేస్తోంది. కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని ఆయన అన్నారు, రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర సైబర్ కమాండ్ కింద 43 సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఆయన అన్నారు.


