న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌ను… G RAM G పేరుతో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. దీని ద్వారా ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ, పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం లోక్‌సభ సభ్యులకు బిల్లు కాపీని నేడు పంపిణీ చేసింది.
బిల్లు కాపీ ప్రకారం.. విక్షిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (VB-G RAM G) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలుగా.. 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంది. ఈ కొత్త పేరులో రామ్ అనే పదం ఉండేలా బీజేపీ కావాలనే ప్లాన్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ బిల్లు “నూట ఇరవై ఐదు రోజుల వేతనం యొక్క చట్టబద్ధమైన హామీని అందించడం ద్వారా విక్షిత్ భారత్ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధి చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది.
అయితే, ఈ పథకం అవసరం మేరకు పని ఇవ్వడం నుంచి పరిమిత బడ్జెట్‌కి మారుతుంది. అంటే.. ఇకపై రాష్ట్రాలు వేతనాల ఖర్చులో కొంత భాగం భరించాల్సి ఉంటుంది. ఇది సుమారు 60:40 నిష్పత్తిలో ఉండొచ్చు. కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం ఖర్చును భరించాల్సి ఉంటుంది. పంటలు చేతికి వచ్చే కాలంలో 60 రోజుల వరకు పథకాన్ని తాత్కాలికంగా ఆపవచ్చు. ఆ తర్వాత మళ్లీ అమలు చెయ్యవచ్చు. వారానికోసారి వేతనాలు చెల్లించే విధానం, టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్ వంటివి కొత్తగా చేర్చారు.


