సిడ్నీ: ఆస్ట్రేలియా బీచ్‌లో ఉగ్రవాదిని ధైర్యంగా ఎదుర్కొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్న ముస్లిం వ్యక్తి అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని పరామర్శించారు. బెడ్ పక్కన నిలబడి అతడి అసాధారణ ధైర్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచారని ఆయనను అభివర్ణించారు. అతడి తెగింపును యావత్తు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అహ్మద్‌ను హీరో అంటూ కొనియాడిని విషయం విధితమే.
మరోవంక అహ్మద్‌ను పరామర్శించిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ట్వీట్ పలువురిని ఆకట్టుకుంటోంది. ‘అహ్మద్…నువ్వు ఆస్ట్రేలియన్ హీరోవి. ఇతరులను కాపాడటం కోసం నీ ప్రాణాలకు పణంగా పెట్టేందుకు నువ్వు వెనుకాడలేదు. బాండీ బీచ్ వద్ద కాల్పులు జరుపుతున్న చోటికి పరుగెత్తుకుంటూ వెళ్లి… ఉగ్రవాదిని నిరాయుధుడిని చేశావు. అత్యంత క్లిష్ట సమయాల్లోనే ఆస్ట్రేలియన్ల గొప్పదనం అందరికీ కనిపిస్తుంది. ఆదివారం రాత్రి అచ్చంగా మేము చూసింది అదే. ప్రతి ఆస్ట్రేలియన్ తరఫున, మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని Xలో పేర్కొన్నారు.
కాగా, ఉగ్రవాదిని లొంగిపోయేలా చేసిన తర్వాత అల్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అల్ అహ్మద్ పై అనేకసార్లు కాల్పులు జరిగాయి. అతని చేతికి, భుజానికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని విలేకరులతో మాట్లాడుతూ… దేశాన్ని విభజించడానికి భయం లేదా ద్వేషాన్ని అనుమతించవద్దని హెచ్చరించారు. “ఉగ్రవాదులు కోరుకునేది ఇదే, కానీ మన దేశాన్ని విభజించడానికి మేము అనుమతించము” అని ఆయన అన్నారు. “మేము ఐక్యంగా ఉంటాము, మేము ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాము మేము దీనిని అధిగమిస్తామని అన్నారు.”
ఆదివారం సాయంత్రం ఉగ్రదాడి సమయంలో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు. ఇంట్లో విషయం చెప్పమని స్నేహితుడికి చెబుతూ ఉగ్రవాదిపై దాడి చేశాడు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తెగింపు ప్రదర్శించాడు. ఈ క్రమంలో అతడికి గాయాలయ్యాయి.
దాడి చేసిన వారిలో ఒకరిని సంఘటనా స్థలంలోనే కాల్చి చంపారు. రెండవ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడి ఆస్ట్రేలియాను కుదిపేసింది. ఎందరో ప్రాణాలను కాపాడిని అల్ అహ్మద్‌ను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మరణించిన పౌరులకు నివాళులు అర్పించారు. సిడ్నీలోని కొన్ని ప్రాంతాల్లో జెండాలను అవనతం చేశారు. కాగా, యావద్దేశం సంతాపం పాటిస్తున్నందున అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు.


