చెన్నై: తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి మొత్తం 97.4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆమె చెప్పారు.కొత్త ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల సంఖ్య 2.77 కోట్లుగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.66 కోట్లుగా ఉందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 7,191 కాగా, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 4.19 లక్షలుగా ఉంది.
ఈమేరకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి విలేకరులతో మాట్లాడుతూ… ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. గణన దశ డిసెంబర్ 14న ముగిసిందని, సవరించిన జాబితాను ఈరోజు విడుదల చేశామని ఆమె తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు ముసాయిదా జాబితాలను విడుదల చేసి, వాటి వివరాలను నమోదిత రాజకీయ పార్టీలకు అందజేశారని చెప్పారు.
గణన దశలో, బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఇళ్లను మూడుసార్లు సందర్శించారని, దాని ఆధారంగానే ముసాయిదా జాబితాను విడుదల చేశామని ఆమె అన్నారు. గైర్హాజరైన వారి ఆధారంగా, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఆధారంగా 97.4 లక్షల పేర్లను తొలగించామని ఆమె చెప్పారు.
ఈమేరకు “BLOలు, BLAలు చేసిన పర్యటనల ఆధారంగా, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, గైర్హాజరైన ఓటర్లు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న వారు వంటి తప్పులను గుర్తించాము,” అని ఆమె అన్నారు. “వారి వివరాలు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చలేదని” ఆమె అన్నారు.
కాగా, మరణించిన ఓటర్లు 26.94 లక్షలు, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా గైర్హాజరైన ఓటర్లు 66.44 లక్షలు ఉన్నారని ఆమె చెప్పారు. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న వారు 3.39 లక్షలు ఉన్నారని, ప్రత్యేక విస్తృత సవరణ ప్రచార సమయంలో 12,000 మంది వ్యక్తులు ఓటు నమోదు చేసుకోవడానికి ఇష్టపడలేదని ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు.
ఎన్నికల శాఖ ద్వారా అభ్యంతరాలు, క్లెయిమ్‌లు చేసుకోవచ్చని…“పేర్లు కనిపించని వారు లేదా కొత్తగా నమోదు చేసుకునే వారు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల కోసం ఫారం 7, చిరునామా మార్పు కోసం ఫారం 8 ఉన్నాయి.” “సమాచారాన్ని సంబంధిత బూత్ స్థాయి అధికారులకు లేదా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు,” అని ప్రధాన ఎన్నికల అధికారి అన్నారు.
తమ పేర్లు కనిపించని వారి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… “వారు BLOలను సంప్రదించవచ్చు. వారు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అది కాకుండా, మేము ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాము,” అని ఆమె అన్నారు.
శ్రీలంక నుండి తిరిగి వచ్చిన వారిని ఫారం 6లో చేర్చారా అని అడిగిన ప్రశ్నకు, “వారిని చేర్చి ఉంటారు. ఇప్పుడు EROలు (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) దానిని తనిఖీ చేస్తారు. ఏవైనా అదనపు పత్రాలు అవసరమైతే, వారు అడుగుతారు. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమవుతుంది” అని ఆమె అన్నారు.
ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపులు జరిగాయని అడిగిన ప్రశ్నకు, షోలింగనల్లూరు, పల్లవరం, అలందూరు అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ చెప్పారు.


