హైదరాబాద్: డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ కేటుగాళ్లు మోసం చేసారు. ఆ విశ్రాంత ఉద్యోగి నుంచి నిందితులు 59 లక్షలు కొట్టేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే… డిసెంబర్ 4న రిటైర్డ్ ఉద్యోగికి గుర్తు తెలియని వ్యక్తులు… పోలీసులు, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వాట్సాప్‌లో కాల్స్ చేశారు. మానవ అక్రమ రవాణా, విదేశీ ఉద్యోగ మోసం, మనీలాండరింగ్ కేసులలో పాల్గొన్నందుకు అరెస్టు చేయబోతున్నామని వారు వృద్ధుడికి చెప్పారని, అతనిని బెదిరించడానికి మెసేజింగ్ పోర్టల్‌లో నకిలీ అరెస్ట్ వారెంట్లు పంపారని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఒత్తిడికి గురైన బాధితుడు… డిసెంబర్ 4 – 6 తేదీల మధ్య నిందితులకు రూ. 59 లక్షలు బదిలీ చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి ఈ కేసును ఛేదించారు. వ్యవస్థీకృత ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ను నిర్వహిస్తున్నందుకు ఇద్దరు నిందితులు సూరంపూడి చంద్రశేఖర్ (31), ఎమండి వెంకట్ నవీన్ (25)లను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, నిందితులు… బాధితుడిని పలు బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని బలవంతం చేశారని, ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS సేవలను పొందడానికి హానికరమైన APK ఫైల్‌లను ఉపయోగించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ షెల్ ఖాతాల ద్వారా నిధులను మళ్లించి క్రిప్టోకరెన్సీగా మార్చుకున్నారు. తరువాత వారు డబ్బును వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
నిందితులు అంతర్రాష్ట్ర ముఠాలో భాగమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 65 సైబర్ మోసం కేసుల్లో వీరి ప్రమేయం ఉందని తెలిపారు. తెలంగాణలో ఐదు కేసుల్లో వీరి ప్రమేయం ఉందని తెలిపారు. ఇప్పటిదాకా వారు రూ. 8 కోట్ల వరకు ప్రజలను మోసం చేశారని వారు తెలిపారు.
మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, అరెస్టు చేసిన ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ పరిస్థితుల్లో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి మోసాలకు గురికావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే భావన లేదని, ప్రభుత్వం లేదా చట్ట అమలు సంస్థలు ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా డబ్బు డిమాండ్ చేయవని వారు చెప్పారు. APK ఫైల్‌లను డౌన్లోడ్ చేయవద్దని లేదా SMS/WhatsApp ద్వారా పంపిన అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని కూడా వారు సూచించారు.


