న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ… హిందూమతం “సర్వోన్నతమైనది” అని అన్నారు. భారతదేశంలోని ముస్లింలు… నదులు, చెట్లు, సూర్యుడిని పూజించడం వంటి ఆచారాలను పాటించాలని సూచించారు. వీటిని పర్యావరణ పరిరక్షణ, శారీరక శ్రేయస్సు కోసం తీసుకునే చర్యలుగా ఆయన అభివర్ణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరైన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూ ఆచారాలపై అభ్యంతరాలను హోసబాలే తిరస్కరించారు. మన ముస్లిం సోదరులు కూడా సూర్య నమస్కారం చేస్తే, వారికి ఏ హాని కలుగుతుంది? దీని అర్థం వారిని మసీదుకు వెళ్లకుండా ఆపుతారని కాదు,” అని అన్నారు. “మన హిందూ ధర్మం సుప్రీం. అది అందరి గురించి మాట్లాడుతుంది,” అని ఆయన అన్నారు.
సూర్య నమస్కారానికి మతంతో సంబంధం లేని ఆచారంగా అభివర్ణించారు. అది శాస్త్రీయమైనది, ఆరోగ్యానికి సంబంధించినదని హోసబాలే పేర్కొన్నారు. “దీనివల్ల ముస్లింలకు ఏం నష్టం జరుగుతుంది? నమాజ్ చేసేవారు ప్రాణాయామం చేస్తే తప్పేంటి? మీరు ఇది చేస్తే నమాజ్ మానేయాలని మేము చెప్పము,” అని ఆయన అన్నారు.
ప్రకృతి ఆరాధనకు సంబంధించిన ఆచారాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, అన్ని వర్గాల వారికి ప్రయోజనకరమని హోసబాలే తెలిపారు. “పర్యావరణ కోణం నుండి ముస్లింలు కూడా నదులను లేదా చెట్లను పూజిస్తే, అందులో తప్పేముంది? అని ఆయన అన్నారు.
హిందూ ధర్మం…ఏ వర్గాన్ని కూడా తమ శత్రువుగా ఆ సంస్థ చూడదని, సమాజం, దేశ శ్రేయస్సు కోసం సమ్మిళితత్వం గురించి మాట్లాడుతుందని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు పేర్కొన్నారు. ప్రజలు ఏ మతాన్నైనా అనుసరించడానికి స్వేచ్ఛ ఉందని, అయితే మానవ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. విభజన గురించి కూడా ఆయన క్లుప్తంగా ప్రస్తావిస్తూ, ఆ కాలంలో హిందువులకు ఏమి జరిగిందో అందరికీ తెలుసని అన్నారు.
హిందూ తత్వశాస్త్రం అన్ని జీవుల పట్ల,ప్రకృతి పట్ల అహింసను బోధిస్తుందని హోసబాలే అన్నారు. పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం వంటి భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాల గురించి మాట్లాడారు. “భారతీయ సాంస్కృతిక మూలాలు ఒక్కటే. పూజించే పద్ధతులు వేర్వేరుగా ఉండవచ్చు, కానీ మతం ఒక్కటే, అదే సనాతన ధర్మం,” అని ఆయన అన్నారు, సనాతన ధర్మాన్ని మానవజాతి శ్రేయస్సును లక్ష్యంగా చేసుకున్న జీవన విధానంగా అభివర్ణించారు. కాగా, హిందూ ఆచారాలను సామాజిక ప్రమాణంగా చూపించి, ముస్లింలు వాటిని స్వీకరించాలని సూచించడంతో ఈ వ్యాఖ్యలు విమర్శలను ఎదుర్కొన్నాయి.
హిందూ మతం “ఉన్నతమైనది” అని ఆయన చేసిన వాదనతో పాటు, ముస్లింలు ఇప్పటికీ మసీదులకు వెళ్లొచ్చు అనే సూచనను విమర్శకులు మతపరమైన ఆధిపత్యం, సాంస్కృతిక సమీకరణకు వ్యక్తీకరణగా చూస్తున్నారు. ఆయన తన ప్రసంగాలలో అహింసను ప్రస్తావించినప్పటికీ… ముస్లింలు, దళితులు, క్రైస్తవులు పదేపదే హిందూత్వ గ్రూపులు, వారి అనుచరుల చేతుల్లో హింసను ఎదుర్కొంటున్న విషయం బహిరంగ రహస్యమే.
కొన్ని నెలల క్రితం”లౌకిక”, “సోషలిస్ట్” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో ఉంచడంపై చర్చకు హోసబాలే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితి సమయంలో ఆ పదాలను రాజ్యాంగంలో చేర్చారని ఆయన వాదించారు.
ఆ డిమాండ్ ప్రతిపక్షాల నుండి బలమైన ప్రతిచర్యలకు దారితీసింది, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమానత్వం, లౌకికవాదం, న్యాయం రాజ్యాంగ విలువలతో RSS అసౌకర్యంగా ఉందని పేర్కొన్నారు.


