ఢాకా: భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం “చేదు సంబంధాలు” కోరుకోవడం లేదని, దానికి బదులుగా న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు.
బంగ్లాదేశ్ దినపత్రిక ‘దేశ్ రూపాంతర్’ ప్రకారం… ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, న్యూఢిల్లీతో సంబంధాలలో సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. భారత్‌తో సంబంధాలు క్షీణించడానికి ప్రభుత్వం ఏమాత్రం అనుమతించదని ఆయన నొక్కి చెప్పారు. ఒక ప్రధాన పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు ఇరుపక్షాల ప్రయోజనాలకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇటీవలి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలపై స్పందిస్తూ… అటువంటి వ్యాఖ్యలు ‘పూర్తిగా రాజకీయమైనవి’ అని, ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదని అహ్మద్ స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ, నిర్మాణాత్మక సంబంధాలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం ప్రభావితం కాదని ఆయన చెప్పారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ నుండి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ధృవీకరించారు. భారత్‌తో సంబంధాలను దెబ్బతీసే బాహ్య ప్రయత్నాల ద్వారా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు లొంగిపోదని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా, గతేడాది ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. ఈ కాలంలో ఢాకా తాత్కాలిక ప్రభుత్వానికి, పాకిస్థాన్‌కు మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల పెరుగుదల కూడా కనిపించింది.
హాదీ హత్యకు కొన్ని రోజుల ముందు అతను ప్రచురించిన “గ్రేటర్ బంగ్లాదేశ్” మ్యాప్‌తో సంబంధం ఉందనే ఊహాగానాలు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశాయి.
సుమారు 170 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయలో అల్లకల్లోలంగా మారింది. హసీనా నిరంకుశ ప్రభుత్వం పతనం తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.


