న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంపై ఉన్న ఆలోచనలు, దాని ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశం… ఇప్పటికీ “హిందూ-ముస్లిం సమస్యలను” ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ…ఆంగ్ల పదం “సెక్యులర్”కు హిందీలో “సర్వ ధర్మ భావ” అని, ఆంగ్లంలో “అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడం” అని అర్థం. అయితే కాంగ్రెస్ తన ఆలోచనల ఆధారంగా వర్ణించినట్లుగా “ధర్మనిరపేక్ష” అని కాదని గడ్కరీ అన్నారు.
“1947 తర్వాత, దేశాన్ని పాలించే అవకాశం కాంగ్రెస్కు లభించింది. వారి ఆలోచనల ఆధారంగా, వారు కొన్ని విత్తనాలను నాటారు…ఫలితంగా స్వాతంత్ర్యం తర్వాత వివిధ రకాల హిందూ-ముస్లిం సమస్యలు తలెత్తాయని” గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ “సెక్యులర్వాద్” (లౌకికవాదం), దాని నిర్వచనమే ఈ సమస్యలను సృష్టించిందని, వాటిని దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.
“మీరు నిఘంటువులో సెక్యులర్ అనే పదానికి అర్థం చూడండి. దాని అర్థం ‘ధర్మనిరపేక్ష’ కాదు. సెక్యులర్ అంటే ‘సర్వ ధర్మ సంభావ’. అందరికీ న్యాయం, ఎవరినీ బుజ్జగించకపోవడమే దాని నిజమైన అర్థం,” అని గడ్కరీ అన్నారు. “దురదృష్టవశాత్తు, 1947 తర్వాత ‘ధర్మనిరపేక్ష’ నిర్వచనం రూపంలో రాజకీయాల్లో తలెత్తిన సమస్య ఇప్పటికీ మనకు ఇబ్బందులను సృష్టిస్తోంది,” అని సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు.
కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా అనుసరించిన విధానాలే ఈ సమస్యలను సృష్టించాయని ఆయన అన్నారు. ఉదయ్ మహుర్కర్ రచించిన “మై ఐడియా ఆఫ్ నేషన్ ఫస్ట్: రీడిఫైనింగ్ అనల్లాయిడ్ నేషనలిజం” అనే పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు.
గతంలో చేసిన “తప్పులను” భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవడానికి చరిత్రను గుర్తు చేసుకోవడం అవసరమని కేంద్ర మంత్రి అన్నారు.
“భారతదేశం ఒక లౌకిక దేశం, అది లౌకికంగా ఉండేది, లౌకికంగానే ఉంటుందని “మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒకప్పుడు నొక్కి చెప్పిన విషయాన్ని గడ్కరీ పునరుద్ఘాటించారు.
ఇది బిజెపి-ఆర్ఎస్ఎస్ వల్ల కాదు. భారతీయ ‘సంస్కృతి’, హిందూ సంస్కృతి, సనాతన సంస్కృతి వల్లనే జరిగింది. దానిలో మనం ‘ప్రపంచం అభివృద్ధి చెందాలి’ అని చెబుతాము” అని ఆయన అన్నారు. పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గడ్కరీ మాట్లాడుతూ… “మేము ‘నా సంక్షేమం, నా కుటుంబం అభివృద్ధి చెందాలి’ అని ఎప్పుడూ అనము” అని గడ్కరీ అన్నారు.
ఈ సందర్భంగా ఒక సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ…భారతీయ సంస్కృతి, నీతి అన్ని విశ్వాసాలను, మత ఆచారాలను గౌరవిస్తాయని మంత్రి అన్నారు. “మన సంస్కృతి మతతత్వ లేదా కులతత్వ స్వభావం కలది కాదు. దీనికి విరుద్ధంగా హిందుత్వం.. కరుణామయం, సహనంతో కూడుకున్నదని ఆయన అన్నారు.
చరిత్రలో ఏ హిందూ రాజు కూడా ఇతరుల మత ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసినట్లు ఎక్కడా దాఖలాలు లేవని గడ్కరీ అన్నారు. “ఎందుకంటే అది మన సంస్కృతి కాదు, మన జన్యువులలో లేదు… మనం ‘అధికారవాదులం’ లేదా ‘విస్తరణవాదులం’ కాదు,” అని ఆయన అన్నారు.
దురదృష్టవశాత్తు భారతీయ, సనాతన సంస్కృతి, దాని చరిత్ర “తీవ్రంగా వక్రీకరించారు”. “మన సొంత ప్రజల్లో” కొందరు దీనికి సహకరించారని ఆయన అన్నారు. “లౌకికవాదం అంటే ఏమిటి? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మరణానంతరం ‘మంత్రాగ్ని’ (మంత్రాలు పఠిస్తూ చితికి నిప్పంటించడం) నిర్వహించడానికి ఒక బ్రాహ్మణుడిని ఎందుకు పిలిచారని నేను ఒకరిని అడిగాను?” అని గడ్కరీ అన్నారు.


