హైదరాబాద్: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికైన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. వారంరితో కలిసి ఈరోజు మధ్యాహ్న భోజనం చేయనున్నారు.
ఈరోజు కోస్గిలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమ్మేళనంలో… సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చలు జరుపుతారు. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి మంగళవారం తన ఎక్స్ ఖాతా ద్వారా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. వారికి సుపరిపాలన అందించడంలో, తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చడంలో, ప్రజల ప్రశంసలు పొందడంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అంతేకాదు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్ను మరింత బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టనున్నారు. కొడంగల్ నియోజకవర్గాన్నిరాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు సీఎం కృషిచేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇలా లంచ్ మీట్ జరపడం మొత్తం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


