వాటికన్ సిటీ: పోప్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాక జరిగిన తొలి క్రిస్మస్ వేడుకల్లో శాంతి, ప్రేమ, ఐక్యత సందేశాలను ప్రపంచ ప్రజలకు అందించారు. కాగా, ఈ క్రిస్మస్ ప్రసంగంలో పోప్ లియో గాజాలో పాలస్తీనియన్ల కష్టాలను స్మరించుకున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు జననాన్ని క్రిస్మస్‌గా జరుపుకునే రోజున గాజా ప్రజల బాధలను గుర్తు చేయడం సంచలనంగా మారింది.
అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ లియో… యేసు ఒక పశువులపాకలో జన్మించిన కథను చెబుతూ…గాజాలోని గుడారాలు వారాల తరబడి వర్షం, గాలి, చలి దెబ్బకు ఎలా తట్టుకుంటున్నాయో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామని?” ప్రశ్నించారు.
దివంగత పోప్ ఫ్రాన్సిస్ వారసుడిగా ప్రపంచ కార్డినల్స్ ద్వారా మే నెలలో ఎన్నికైన తర్వాత తన మొదటి క్రిస్మస్‌ను జరుపుకుంటున్న లియో… ఇటీవల చాలాసార్లు గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితుల గురించి కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సంఘర్షణల్ని కేవలం చర్చల ద్వారా పరిష్కరించుకోగలమని అభిప్రాయపడ్డారు.
‘గాజాలో కొన్ని వారాలుగా ఎడతెగని వానలకు, చలిగాలులకు గజగజ వణుకుతున్న గుడారాలను ఎలా మరువగలం. తమ సొంత నగరంలోనే ఇల్లులేని అనాథలుగా తాత్కాలిక షెల్టర్లలో కాలం వెళ్లదీస్తున్న వారిని ఎలా మరువగలం’ అని ప్రశ్నించారు. కల్లోలం నుంచి శాంతి ఉద్భవించాలంటే సంప్రదింపులే మార్గమని నొక్కి చెప్పారు. కాగా, గత నెలలో జర్నలిస్టులతో మాట్లాడుతూ… ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణకు ఏకైక పరిష్కారం స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు అని అన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు సాగించిన మారణహోమం తర్వాత అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాయి, కానీ గాజా జనాభా మొత్తం నిరాశ్రయులుగా మారింది. ఇక గాజాలోకి చాలా తక్కువ మానవతా సహాయం అందుతోందని హ్యుమటేరియన్ సంస్థలు చెబుతున్నాయి.
గురువారం సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల పరిస్థితులు, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధాల వల్ల కలిగే విధ్వంసం గురించి లియో కూడా విచారం వ్యక్తం చేశారు.
పోప్ ప్రసంగం వీడియో లింక్


