Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బీజేపీ నేత కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం!

Share It:

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడి కుమారుడిపై గతంలో అత్యాచారం ఆరోపణలు చేసిన ఒక మహిళ… నిద్రమాత్రలు,ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం… బీజేపీ నేత, శివపురి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్రి శర్మ కుమారుడు రజత్ శర్మపై ఏప్రిల్ 30న సదరు మహిళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తన పరిస్థితి వేగంగా క్షీణించడంతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతోందని సమాచారం.

విషం సేవించడానికి ముందు ఆ మహిళ ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా రాసింది, అందులో గత ఏడు నెలలుగా తనను మానసికంగా వేధించారని, బెదిరించారని పేర్కొంది.

“నేను పూర్తి స్పృహతో ఈ ఆత్మహత్య లేఖ రాస్తున్నాను. నా మరణానికి కారణం శివపురి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్రి శర్మ, ఆమె భర్త సంజయ్ శర్మ. వారి కుమారుడు రజత్ శర్మతో నా సంబంధం గురించి వారికి ముందే తెలుసు. గాయత్రి శర్మ గతంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని, పెళ్లి గురించి చర్చిస్తానని చెప్పింది,” అని ఆ లేఖలో ఉంది.

రజత్ శర్మ తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయగా, అదే సమయంలో అతని కుటుంబం వేరే చోట నిశ్చితార్థానికి ప్రణాళిక వేసిందని, నిశ్చితార్థం తేదీని ఏప్రిల్ 14, 2025గా నిర్ణయించారని ఆ మహిళ ఆరోపించింది.

ఆమె తల్లి,బీజేపీ నాయకురాలు గాయత్రి శర్మ తనను బెదిరించారని, త్యాగం, అంకితభావం నేర్చుకోవాలని తనకు చెప్పారని కూడా ఆ మహిళ పేర్కొంది. “ఆమె నన్ను దూషించినప్పుడు ఆమె కొడుకు అక్కడే ఉన్నాడు,” అని ఆ లేఖలో ఉంది.

ఏప్రిల్ 14న (రజత్ శర్మ నిశ్చితార్థం జరుగుతున్న అదే రోజు) తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, ఐదు గంటల పాటు వేచి ఉన్నప్పటికీ తన ఫిర్యాదును నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించింది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై రాజకీయ ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపింది.

ఈ కేసు వివరాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ నాయకులు, పదవీ విరమణ చేసిన అధికారులు, పోలీసు సిబ్బంది ద్వారా తనను బెదిరించి, రాజీ పడమని ఒత్తిడి చేశారని, అలాగే రూ. 50 లక్షలు కూడా ఆఫర్ చేశారని ఆ మహిళ లేఖలో ఆరోపించింది.

గత ఏడు నెలలుగా తనను పదేపదే అవమానించారని, బెదిరించారని, కించపరిచారని, దీనివల్ల తాను మానసికంగా కుంగిపోయానని ఆ మహిళ చెప్పింది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివపురి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ… మహిళ ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 69 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసామని, ఛార్జిషీట్ కూడా దాఖలు చేసామని తెలిపారు.

“ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నాము. మహిళ ఆరోగ్యం నిలకడగా మారిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము,” అని ఎస్‌పీ రాథోడ్ అన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.