ఇండోర్/ఖండ్వా: మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఖండ్వా జిల్లా యంత్రాంగం ఏఐ (కృత్రిమ మేధస్సు) ద్వారా రూపొందించిన చిత్రాలను ఉపయోగించి జాతీయ జల సంరక్షణ అవార్డును గెలుచుకుందని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణను అధికారులు తోసిపుచ్చారు.
కేంద్రం ‘జల్ సంచయ్, జన్ భాగీదారి’ ప్రచారం కింద జల సంరక్షణలో విశిష్ట కృషికి ఖండ్వా జిల్లా దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని పొందింది. నవంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన ఆరవ జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లాకు రూ. 2 కోట్ల అవార్డు లభించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ్వా జిల్లాలోని కవేశ్వర్ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో రెండో బహుమతిని కూడా గెలుచుకుందని వారు చెప్పారు.
ఈమేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ మాట్లాడుతూ… “బీజేపీ ప్రభుత్వం మన పిల్లలకు ఏఐని సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో నేర్పించాల్సింది పోయి, తానే ఏఐని ఉపయోగించి అవినీతికి పాల్పడుతోంది. ఖండ్వాలో ప్రభుత్వ అధికారులు రెండు అడుగుల లోతు ఉన్న గుంతలను ఏఐని ఉపయోగించి బావులుగా మార్చి, ఆ ప్రాంతంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ఏఐ-సృష్టించిన చిత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు.” ఈ చిత్రాల ఆధారంగా వారు గౌరవ రాష్ట్రపతి నుండి అవార్డు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
“క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించగా…అక్కడ పొలాలు, ఖాళీ స్థలాలు కనిపించాయి. స్పష్టంగా, ఇది జల సంరక్షణ కాదు, సాంకేతికతతో సృష్టించిన చిత్రాల ఆట. బీజేపీ పాలనలో అవినీతి కూడా స్మార్ట్‌గా మారిందని” ఆయన అన్నారు.
జాతీయ జల అవార్డుకు సంబంధించిన ఆరోపణలపై వివాదం ముదరడంతో, ఖండ్వా యంత్రాంగం తమ వైఖరిని స్పష్టం చేయడానికి ఒక విలేకరుల సమావేశం నిర్వహించింది.
జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) నాగార్జున్ బి. గౌడ మాట్లాడుతూ…ఏఐ-సృష్టించిన చిత్రాలను అప్లోడ్ చేయడానికి జాతీయ జల అవార్డుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ‘జల్ సంచయ్, జన్ భాగీదారి’ ప్రచారం కింద చేపట్టిన 1,29,046 పనులను “సమగ్ర పరిశీలన తర్వాత ధృవీకరించిన చిత్రాలను” ‘జల్ సంచయ్, జన్ భాగీదారి’ ప్రచార పోర్టల్‌లో అప్లోడ్ చేశామని ఆయన చెప్పారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ చిత్రాలన్నింటినీ ధృవీకరించిందని, మొత్తం పనులలో ఒక శాతం పనులకు యాదృచ్ఛిక క్షేత్ర తనిఖీలు కూడా నిర్వహించిందని గౌడ తెలిపారు. “ప్రాథమికంగా ఖండ్వా జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ పనుల గురించి కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
జల సంరక్షణకు సంబంధించిన ఫోటోలను కేవలం విద్యా, ప్రేరణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే ‘క్యాచ్ ది రెయిన్’ అనే మరో పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని ఆయన చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన 21 చిత్రాలను ‘క్యాచ్ ది రెయిన్’ పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఇది దురుద్దేశంతో చేసి ఉండవచ్చు. ఈ చిత్రాలను అప్లోడ్ చేసిన వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సీఈఓ తెలిపారు.
“క్యాచ్ ది రెయిన్ పోర్టల్ అనేది ‘జల్ సంచయ్, జన్ భాగీదారీ’ ప్రచార పోర్టల్ కంటే పూర్తిగా భిన్నమైనది. ‘క్యాచ్ ది రెయిన్’ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన చిత్రాల ఆధారంగా ‘జల్ సంచయ్, జన్ భాగీదారీ’ ప్రచారం కింద అవార్డులను పరిగణనలోకి తీసుకోరు” అని గౌడ తెలిపారు.
‘జల్ సంచయ్, జన్ భాగీదారీ’ ప్రచారం కింద ఖండ్వా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 1.25 లక్షలకు పైగా నీటి సంరక్షణ పనులు చేపట్టామని ఆయన తెలిపారు.
जहाँ भाजपा सरकार को हमारे बच्चों को AI का सदुपयोग सिखाना चाहिए, वहीं वह खुद AI से भ्रष्टाचार कर रही है।
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) December 29, 2025
खंडवा में भाजपा सरकार के अधिकारियों ने जल संरक्षण के नाम पर दो फीट के गड्ढों को AI से कुआँ बना दिया और पूरे क्षेत्र में तरह तरह के विकास कार्यों की AI से बनाई गई तस्वीरें… pic.twitter.com/ya4gLLTUmf


