ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు తాగడం వల్ల ముగ్గురు మరణించారని, 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారని నగర మేయర్ తెలిపారు. డ్రైనేజీ నీరు తాగునీటి సరఫరాలోకి కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిందని, నీటి నమూనాలను పరీక్షల కోసం పంపామని అధికారులు తెలిపారు.
కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై నలుగురు మహిళలతో సహా ఐదుగురు మరణించారని స్థానికులు పేర్కొన్నారు. లోకల్ కౌన్సిలర్ ప్రకారం… డిసెంబర్ 25న సరఫరా చేసిన నీటికి వాసన వచ్చిందని, ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై ఉండవచ్చని భాగీరత్‌పురా నివాసితులు ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ మరణాలపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని, బాధితుల వైద్య ఖర్చులను భరిస్తుందని చెప్పారు.
ఈ దుర్ఘటనపై ఇండరో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…ప్రధాన నీటి పైపులైన్లో లీకేజీని గుర్తించినట్లు తెలిపారు. భగీరత్పురలోని ఒక చోట మంచినీటి పైప్‌లైన్‌పై మరుగుదొడ్డి నిర్మించినట్లు కనుగొన్నారు.
భగీరత్‌పురలో అతిసార వ్యాధి ప్రబలినట్లు నివేదికలు అందిన తర్వాత, ఆరోగ్య శాఖ 2,703 గృహాలలో సర్వే చేసి, సుమారు 12,000 మందిని పరీక్షించిందని, తేలికపాటి లక్షణాలు ఉన్న 1,146 మంది రోగులకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించామని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ మాధవ్ తెలిపారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న 111 మంది రోగులను వివిధ ఆసుపత్రులలో చేర్చామని, వారిలో 70 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు. “కలుషిత నీరు తాగిన తర్వాత వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌తో రోగులు బాధపడ్డారని డాక్టర్ అన్నారు. ఈమేరకు అతిసార వ్యాధిని ఎదుర్కోవడానికి నాలుగు అంబులెన్స్‌లతో పాటు అనేక వైద్య బృందాలను భగీరత్‌పురలో మోహరించారు. ఆ ప్రాంతం నుండి తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు.
కాగా, కలుషిత నీటి కారణంగా జరిగిన మరణాలపై ఇండోర్ మేయర్ పుష్పమిత్ర భార్గవ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్‌పై హత్య కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి, కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఈమేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు విలేకర్లతో మాట్లాడుతూ…”మురుగునీరు తాగునీటి పైప్లైన్లలో కలిస్తే, ప్రజలు వాంతులు, విరేచనాలు,కామెర్లతో బాధపడతారు, కానీ చనిపోరు. తాగునీటి పైప్‌లైన్‌లో ఏదో ఒక విషపూరిత పదార్థం కలిసిపోయినట్లు కనిపిస్తోంది.దీనిపై విచారణ జరపాలి.” ఈ సంఘటనకు మేయర్,మున్సిపల్ కమిషనర్‌ను బాధ్యులను చేస్తూ, వారిద్దరిపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు.
పాలక బీజేపీని లక్ష్యంగా చేసుకుని, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే కాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో ఉందని ఆయన అన్నారు. బీజేపీ త్రిబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో… నగరం ఏ పరిస్థితికి చేరుకుందో అనేది ఇండోర్ ప్రజలకు ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు.


