హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు “బారీ అన్యాయం” చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నదీ జలాల వినియోగంలో జరిగిన నష్టానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు టి హరీష్ రావును ఉరితీసినా తప్పులేదని సీఎంఅన్నారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి తమ ఇద్దరు నాయకుల మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. నదీ జలాల సమస్యలపై సాగునీటి శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు. తన వాదనకు అనుగుణంగా కాళోజీ నారాయణరావు చెప్పిన ఒక మాటను సీఎం గుర్తు చేశారు: “మనల్ని దోచుకునే బయటివారిని తరిమికొడతాం, మన ప్రాంతం వారే మనల్ని దోచుకుంటే వారిని సజీవ సమాధి చేస్తాం”. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో “అన్యాయానికి గురైనందుకే” తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో, నిధుల కేటాయింపులో రాష్ట్రం “మరింత అన్యాయానికి” గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతోందని.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని సీఎం ఆరోపించారు. కెసిఆర్, హరీష్ రావు తెలంగాణకు రావలసిన కృష్ణా జలాల్లో ఆనాడు చేసిన సంతకాలే మరణ శాసనంగా మారాయని అన్నారు.. కెసిఆర్ అసెంబ్లీకి వస్తే మొత్తం ఆధారాలతో సహా వివరాలను మొత్తం బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు.
”నీటి హక్కుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. కృష్ణా, గోదావరి నదుల్లో లభించే నీటిని వాడుకోవడం విషయంలోనే ఇబ్బంది ఎదురవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నాయకులు నాడు మా పార్టీనే ప్రశ్నించారు. కృష్ణా జలాలను తెలంగాణకు 34 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66% నీటి వాటాలు ఇవ్వడానికి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ ఒప్పుకున్నారని సీఎం అన్నారు.
“కాళోజీ నారాయణరావు చెప్పిన మాటలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావుకు సరిగ్గా వర్తిస్తాయి. నేను అధికారికంగా చెబుతున్నాను—నదీ జలాల సమస్యల్లో జరిగిన అన్యాయానికి వారిని ఉరితీసినా తప్పులేదు,” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అయితే, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ 26/11 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కూడా సుదీర్ఘమైన, నిష్పక్షపాత విచారణ తర్వాతే ఉరిశిక్ష విధించారని ఆయన గుర్తు చేశారు. “కసబ్‌కే అన్ని సౌకర్యాలు ఉంటే, కేసీఆర్‌కు ఎన్ని ఉంటాయో ఊహించండి. పైగా, వారు డబ్బు సంపాదించారు కాబట్టి ఏ లాయర్‌నైనా నియమించుకోగలరు,” అని ఆయన అన్నారు.
నదీ జలాల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై చర్చ కోసం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆయన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని, సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడికి తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.


