లక్నో: ఘజియాబాద్‌లో ఒక హిందూ మితవాద సంస్థ బహిరంగంగా కత్తులు పంపిణీ చేయడం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలను నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి.
సోమవారం, హిందూ రక్షా దళ్ అనే హిందూ మితవాద సంస్థకు చెందిన సభ్యులు ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి, కత్తులు, గొడ్డళ్లు,ఇతర పదునైన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం… నిర్వాహకులు ఈ ఆయుధాలను స్థానిక హిందువులకు పంపిణీ చేయడమే కాకుండా, రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ కార్యక్రమాన్ని హిందూ రక్షా దళ్ జాతీయ అధ్యక్షుడు పింకీ చౌదరి నాయకత్వంలో నిర్వహించినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేసే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు ఈ కార్యక్రమం చాలా గంటల పాటు కొనసాగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి, స్టాల్ వద్ద ఆయుధాలు ఇంకా ప్రదర్శనలో ఉన్నాయి. పలువురు నిర్వాహకులు కూడా అక్కడే ఉన్నారు. పోలీసులను చూడగానే కొందరు పారిపోగా, మరికొందరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
షాలిమార్ గార్డెన్, సాహిబాబాద్ ఏసీపీలతో పాటు, లింక్ రోడ్, టిలా మోర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కత్తులు, గొడ్డళ్లు, ఇతర చట్టవిరుద్ధమైన పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో ఈ కార్యక్రమాన్ని పింకీ చౌదరి ఆదేశాల మేరకే నిర్వహించినట్లు వారు అంగీకరించినట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కారణంగా చూపుతూ… తాము దాదాపు 250 కుటుంబాలకు కత్తులు పంపిణీ చేశామని హిందూ రక్షా దళ్ తర్వాత పేర్కొంది. ఆయుధాలను “స్వీయ రక్షణ” కోసం పంపిణీ చేశామని ఆ సంస్థ వాదించింది మరియు ప్రతి హిందువుకు ఆయుధ లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాము ఆయుధాల పంపిణీని కొనసాగిస్తామని, భవిష్యత్తులో వాటిని ఉపయోగించడంలో శిక్షణ కూడా ఇస్తామని పేర్కొంది.
ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాన్స్-హిండన్) నిమిష్ పాటిల్ మాట్లాడుతూ…పింకీ చౌదరి సహా 17 మంది నిందితులు, 24 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. “వారు షాలిమార్ గార్డెన్ కాలనీలోని తమ కార్యాలయంలో కత్తులు పంపిణీ చేసి, రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారని” డీసీపీ తెలిపారు.
ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. అయితే పింకీ చౌదరి పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల స్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. బహిరంగ ప్రదేశంలో అక్రమ ఆయుధాలను ప్రదర్శించడం, పంపిణీ చేయడం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని విమర్శకులు ఎత్తి చూపారు. పోలీసులు లేదా నిఘా సంస్థలు ముందస్తు సమాచారం అందకుండా ఇటువంటి కార్యక్రమం గంటల తరబడి ఎలా కొనసాగిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఎంపిక చేసి అమలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రజల ఇళ్లకు హింసాత్మక భావజాలం, హింసాత్మక ఆయుధాలను సరఫరా చేస్తున్న వారిని ఊరికే వదిలిపెడతారా అని ప్రశ్నించారు. హింస అనేది అనాగరిక శక్తుల లక్షణం, బలహీన పాలనకు సంకేతం” అని ఎస్ఫీ ఛీప్ అన్నారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సామాజిక అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి షా నవాజ్ ఆలం ఆరోపించారు. “హిందూ రక్షా దళ్ అధికార పార్టీ నుండి వేరుగా లేదు; దీనికి పాలక పార్టీ మద్దతు ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
చట్టవిరుద్ధంగా పంపిణీ చేసిన ఆయుధాలను వాటిని అందుకున్న వారి నుండి ఇంకా ఎందుకు తిరిగి పొందలేదని కూడా ప్రతిపక్షం ప్రశ్నించింది. అలాంటి పదునైన ఆయుధాల నిరంతర పంపిణీ ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు.


