న్యూఢిల్లీ: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భందించడంపై భారతదేశం తన మౌనాన్ని వీడింది. “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది, కానీ వాషింగ్టన్ పేరును ప్రస్తావించలేదు సరికదా… లాటిన్ అమెరికన్ నేతను పట్టుకునేందుకు చేసిన సైనిక దాడులను మన దేశం ఖండించలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జనవరి 3) అమెరికా దళాలు “ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్” పేరిట దాడులు నిర్వహించాయని ప్రకటించారు. ఇది వెనిజులాపై పెద్ద ఎత్తున సైనిక దాడి, దీని ఫలితంగా మదురో, అతని భార్య పట్టుబడ్డారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా,నార్కో-టెర్రరిజం ఆరోపణలను విచారించేందుకు ఈ జంటను న్యూయార్క్‌కు తరలించారు.
కాగా, నిన్న మధ్యాహ్నం విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చేసిన ప్రకటనలో వెనిజులా ప్రజల శ్రేయస్సు కోసం భారతదేశం మద్దతును నొక్కి చెప్పింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చింది.
“వెనిజులాలో ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మేము ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము” అని ప్రకటనలో పేర్కొన్నారు. “వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దృష్ట్యా… చర్చల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేము సంబంధిత వారందరికీ పిలుపునిస్తున్నాము.”
ఈమేరకు కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ సమాజ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తోందని, “సాధ్యమైనంత సహాయం అందిస్తూనే ఉంటుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
నిన్ననే, న్యూఢిల్లీ భారత పౌరులు వెనిజులాకు అనవసర ప్రయాణాలను నివారించాలని ఒక సలహాను జారీ చేసింది. ఆ దేశంలో ఉన్నవారు తగు జాగ్రత్త వహించాలని సూచించింది. కానీ కారకాస్‌పై పెరుగుతున్న అమెరికా సైనిక ఒత్తిడిపై ఇండియా మౌనంగా ఉంది. కాగా,
భారతదేశ ప్రకటన అమెరికా ఆపరేషన్‌కు అంతర్జాతీయంగా వచ్చిన పదునైన ప్రతిచర్యకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, సైనిక చర్యను ఖండించడం లేదా యునైటెడ్ స్టేట్స్ పేరును నేరుగా ప్రస్తావించలేదు..
న్యూఢిల్లీ నుండి రాజకీయ ప్రతిస్పందనను జారీ చేయడంలో జరిగిన ఆలస్యం, నిశ్శబ్ద స్వరం గమనార్హం. భారతదేశం సాంప్రదాయకంగా సార్వభౌమాధికారం,ప్రాదేశిక సమగ్రత సూత్రాలను సమర్థించింది, పొరుగు దేశాలతో దాని స్వంత వివాదాలలో తరచుగా ఈ సూత్రాలను ఉపయోగిస్తుంది.
గాజా వివాదం, ఉక్రెయిన్ యుద్ధం… ఈ రెండింటిని భారతదేశం ఖండించలేదు. అయితే, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా, భారతదేశం ప్రత్యేకంగా ప్రాదేశిక సమగ్రత, UN చార్టర్‌కు మద్దతును కోరింది – వెనిజులా ప్రకటనలో స్పష్టంగా కనిపించని సూచనలు.
ముఖ్యంగా భారతదేశం ఇప్పటికే అధిక US సుంకాలతో పోరాడుతున్నందున, దిగుమతి సుంకాలను తగ్గించే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరించడానికి US అధ్యక్షుడిని ఒప్పించలేకపోయినందున, వెనిజులా విషయంలో ట్రంప్‌ను వ్యతిరేకించకుండా న్యూఢిల్లీ మౌనం పాటించింది.
మరోవంక US చర్యకు వ్యతిరేకంగా భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. “వెనిజులాపై అమెరికా దురాక్రమణను, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య కిడ్నాప్‌ను” తీవ్రంగా ఖండించాయి.
వెనిజులా చమురు నిల్వలను స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ చెప్పడం ద్వారా “ఈ దురాక్రమణ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాలను” బయటపెట్టారని వామపక్ష పార్టీల ప్రకటన ఆరోపించింది. క్యూబా మరియు మెక్సికో తదుపరి లక్ష్యాలు కావచ్చని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హెచ్చరించారని, ఇది “మొత్తం ప్రపంచంపై ఆధిపత్యం వహించడానికి” ప్రయత్నిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదంలో భాగమని వామపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు “భారత ప్రభుత్వం అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో గొంతుకలపాలని వెనిజులాకు మద్దతుగా నిలబడాలని” లెఫ్ట్ పార్టీలు పేర్కొన్నయి.
భారత ప్రభుత్వ విధానం గ్లోబల్ సౌత్‌లోని అనేక ప్రధాన శక్తుల ప్రతిస్పందనలకు భిన్నంగా ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ నిర్బంధాన్ని ఖండించారు, దాడులను “అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడం” అని పేర్కొన్నారు. మదురోకు అతిపెద్ద రుణదాత,అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయిన చైనా, “తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాను” అని పేర్కొంది. అమెరికా “ఆధిపత్య చర్యలు” ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది.
దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల విభాగం ఈ చర్యలను “ఐక్యరాజ్యసమితి చార్టర్ స్పష్టమైన ఉల్లంఘన”గా అభివర్ణించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దాడులను “ప్రమాదకరమని” అభివర్ణించారు. నేడు భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా… తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాకు పిలుపునిచ్చారు. ఓ టెలివిజన్ ప్రసంగంలో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ… అమెరికా సైనిక చర్చను “అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే దారుణం”గా ఖండించారు. మదురోను వెంటనే విడుదల చేయాలని, అతన్ని వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాగా, డెల్సీ ప్రతిస్పందనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “దీన్ని మేం సహించబోం. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది. వెనెజువెలాపై మా నియంత్రణకు ఆమె అంగీకరించాల్సిందే. అప్పుడే ఆ దేశాన్ని మేం పునర్ నిర్మించగలం. మేం కోరుకున్నది ఆమె చేస్తే.. వెనిజులాలో మా బలగాలను మోహరించబోం” అని ట్రంప్ హెచ్చరించారు.


