Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

వెనిజులాపై అమెరికా చర్యకు వ్యతిరేకంగా ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన!

Share It:

న్యూఢిల్లీ: వెనిజులాపై అమెరికా దాడిని, అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను నిర్బంధించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనికి నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. వెనిజులాపై “సామ్రాజ్యవాద సైనిక దురాక్రమణ”ను సిపిఐ(ఎం) నాయకత్వం అమెరికాను ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ఈ చర్యకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని కోరింది. దక్షిణ అమెరికా దేశంలోని చమురు వనరులను “స్వాధీనం” చేసుకోవడానికి అమెరికా వెనిజులాపై దాడి చేసిందని నిరసనకారులు ఆరోపించారు.

సార్వభౌమదేశమైన వెనిజులాపై అమెరికా దురాక్రమణ దాడి చేసి, అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్‌ చేసి, న్యూయార్క్‌ జైలులో నిర్బంధించడం గర్హనీయం. ప్రపంచాన్ని దోచుకోవడమే తమ విధానమని, అందుకోసం ఎంతకైనా తెగిస్తామని నిస్సిగ్గుగా మరోసారి అగ్రరాజ్యం నిరూపించుకుందని వామపక్షాలు ఎత్తిపొడిచాయి. అమెరికన్‌ సామ్రాజ్యవాదం దుష్టస్వభావంపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తినా…అమెరికా పేరు కూడా ఎత్తడానికి భయపడిపోతున్న భారత్‌లోని మోడీ ప్రభుత్వ తీరు అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు.

మరోవంక మదురో దీర్ఘకాలంగా నార్కో-టెర్రరిజం మరియు కొకైన్ అక్రమ రవాణా కుట్రకు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపిస్తూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విస్తృతమైన అభియోగపత్రాన్ని సిద్ధం చేశారు. ఈ అభియోగపత్రాన్ని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి బహిర్గతం చేసి, న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా మదురో అధికారాన్ని ఉపయోగించి అమెరికా వైపు భారీ మొత్తంలో కొకైన్‌ను తరలించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. మదురోపై నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, తుపాకీ నేరాలు, సంబంధిత నేరాల అభియోగాలు మోపారు. ఇది 1999లో ప్రారంభమై 2025 వరకు కొనసాగిందని ఆరోపించారు.

సిపిఐ(ఎం), సిపిఐ, సిపిఐ(ఎంఎల్), ఆర్‌ఎస్‌పి,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా అమెరికా “దూకుడు”ను విమర్శించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో చేరాలని, వెనిజులాకు సంఘీభావంగా నిలబడాలని కేంద్రాన్ని కోరాయి.

వెనిజులాపై అమెరికా దాడి తర్వాత వామపక్ష పార్టీల ప్రధాన కార్యదర్శులు ఎం.ఎ. బేబీ (సిపిఐ-ఎం), డి. రాజా (సిపిఐ), దీపాంకర్ భట్టాచార్య (సిపిఐ-ఎంఎల్), జి. దేవరాజన్ (ఎఐఎఫ్‌బి),మనోజ్ భట్టాచార్య (ఆర్‌ఎస్‌పి) కూడా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా చర్య ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను “స్పష్టంగా ఉల్లంఘించిందని” సార్వభౌమాధికార దేశంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.

“అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో, వెనిజులా చమురు నిల్వలను తాము స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ, ఈ దురాక్రమణ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను బయటపెట్టారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరో అడుగు ముందుకు వేసి, క్యూబా, మెక్సికో తమ తదుపరి లక్ష్యాలుగా ఉంటాయని హెచ్చరించారని” ఆ ప్రకటనలో ఉంది.

మరోవంక డొనాల్డ్ ట్రంప్… మన్రో సిద్ధాంతాన్ని పునరుద్ధరించడం, పశ్చిమార్ధగోళంలో అమెరికా ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వామపక్ష పార్టీలు ఆరోపించాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.