Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం…రెవెన్యూ మంత్రి పొంగులేటి!

Share It:

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ… ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయని, ఇది గందరగోళానికి, అసౌకర్యానికి కారణమవుతోందని ఆయన ఎత్తి చూపారు. అంతేకాదు మండలాలు, జిల్లాలను ఏకపక్షంగా విభజించారని, ఇది పరిపాలనాపరమైన అవకతవకలకు దారితీసిందని మంత్రి అన్నారు.

కొన్ని సందర్భాల్లో, జిల్లాల విభజన హేతుబద్ధమైన ప్రాతిపదిక లేకుండా జరిగిందని, కొందరికి అనుకూలంగా, మరికొందరికి నష్టం కలిగించేలా, చివరికి లక్కీ నంబర్స్‌ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని మంత్రి వివరించారు. జిల్లాలు, మండలాలను సరైన ప్రమాణాలు లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని పొంగులేటి అన్నారు. అప్పటి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతాలను జిల్లా లేదా మండలాలుగా ప్రకటించిందని ఆయన ఆరోపించారు. దీని ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు రాష్ట్రంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తుందని, నివేదిక అందిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడుతుందని మంత్రి సభకు హామీ ఇచ్చారు. సభలో చర్చించిన తర్వాత అందరి ఏకాభిప్రాయంతో ప్రభుత్వం ఈ పునర్వ్యవస్థీకరణను చేపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభకు తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.