కోల్‌కతా: గత వారం కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ నివాసంలో జరిగిన దాడుల సమయంలో తమ అధికారులను “అక్రమంగా నిర్బంధించారంటూ” ఈడీ నేడు సుప్రీంకోర్టులో రెండో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు నిశాంత్ కుమార్, విక్రమ్ అహ్లావత్, ప్రశాంత్ చండీలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ప్రియోబ్రతో రాయ్‌లపై దాఖలు చేశారు. బొగ్గు అక్రమాల కుంభకోణానికి సంబంధించి డిసెంబర్ 8న కోల్‌కతాలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు “అక్రమ నిర్బంధం” జరిగిందని ఈడీ ఆరోపించింది.
“ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు ఉదయం 6.20కు ప్రారంభమయ్యాయి. అప్పుడు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి, పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి చట్టవిరుద్ధంగా, అనధికారికంగా ఆ ప్రాంగణంలోకి చొరబడ్డారు. సోదాలు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అక్రమంగా నిర్బంధించి… ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి డిజిటల్ పరికరాలను వారి నుండి లాక్కుని, ఒక ట్రంకు నిండా ఫైళ్లతో ఆ ప్రాంగణం నుండి వెళ్లిపోయారు” అని దర్యాప్తు సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు వారు ఈడీ అధికారి ల్యాప్‌టాప్‌ను కూడా తీసుకుని, రెండు గంటల తర్వాత తిరిగి ఇచ్చారని కూడా అందులో పేర్కొంది.
“ల్యాప్‌టాప్‌ను తీసుకుని రెండు గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడం కూడా దొంగతనమే అవుతుంది” అని దర్యాప్తు సంస్థ తన 160 పేజీల పిటిషన్‌లో పేర్కొంది. “మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో సోదాల ప్రక్రియ జరుగుతున్నప్పుడు, రాష్ట్ర అధికారులు/పోలీసు అధికారులు ఈడీ అధికారులు సేకరించిన పత్రాలను తీసుకువెళ్లారు. అంతేకాకుండా, కంప్యూటర్ సిస్టమ్, ఈమెయిల్ బ్యాకప్‌ను కూడా మధ్యలోనే నిలిపివేశారు. రాష్ట్ర భద్రతా అధికారులు ఆ కంప్యూటర్ సిస్టమ్‌ను తీసుకువెళ్లారు. ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భద్రతా కెమెరాల స్టోరేజ్ పరికరాన్ని కూడా రాష్ట్ర భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంగణంలో ఉన్న మెస్సర్స్ ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల మొబైల్ ఫోన్లను కూడా రాష్ట్ర పోలీసులు తీసుకువెళ్లారు. ఫలితంగా ఆ ప్రాంగణం నుండి ఈడీ ఏమీ స్వాధీనం చేసుకోలేపోయిందని పిటీషన్‌లో పేర్కొంది.
కోల్‌కతాలో సోదాల సందర్భంగా జరిగిన తీవ్ర ఉద్రిక్తతల రోజున రాష్ట్ర పోలీసులు ఈడీపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈడీ కూడా తన అధికారులపై నమోదైన ఈ కేసులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


