చెన్నై: టీవీకే ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ…విజయ్ను జనవరి 19న మరో విడత విచారణకు పిలిచినప్పటికీ, ఆయన పార్టీ టీవీకే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది. విజయ్ మొదటి నుంచీ కాషాయ పార్టీని తన సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణిస్తూ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తును తోసిపుచ్చుతూనే ఉన్నారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకున్న ఏఐఏడీఎంకేతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన పరోక్షంగా సూచించారు.
విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికేషన్ లభించకపోవడంతో, అది కీలకమైన పొంగల్ రోజున విడుదల కాకుండా ఆగిపోయింది. దీంతో చిత్ర నిర్మాత ఈ వివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. పాలక డీఎంకేను ఎదుర్కోవడానికి విజయ్ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి, ఆయనతో “రాజకీయ ఒప్పందం” కోసం బీజేపీ ఈ కుట్రకు కేంద్రంగా ఉందని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు.
సీబీఐ విచారణ తర్వాత విజయ్ చెన్నైకి తిరిగి వచ్చిన కొద్ది నిమిషాలకే, టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ… “టీవీకే సైద్ధాంతిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదు” అని అన్నారు.
కాగా, మంగళవారం తమిళనాడులో పర్యటించిన రాహుల్ గాంధీ, విజయ్ ‘జన నాయగన్’ చిత్రం విషయంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేయడంతో, 2026 ఎన్నికలకు ముందు, టీవీకే మధ్య సాధ్యమయ్యే పునరేకీకరణపై ఊహాగానాలకు బలం చేకూరింది.
మరోవంక ఎక్స్ వేదికగా రాహుల్ బీజేపీని విమర్శించారు.’జన నాయగన్’ చిత్రాన్ని అడ్డుకోవడానికి ఐ&బి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి. మిస్టర్ మోడీ, తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని పోస్ట్ చేశారు.” అయితే, కాంగ్రెస్ నాయకత్వం తమ పాలక డీఎంకేతో పొత్తుకు అధికారంలో వాటా, మరిన్ని సీట్లు కావాలని పునరుద్ఘాటించింది.
టీవీకే అధికారంలో వాటా ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ పెద్ద రాజకీయ పార్టీ కూడా దానితో చేరలేదు. రాహుల్ గాంధీ మద్దతును ప్రస్తావిస్తూ… టీవీకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతోందా అనే నిర్దిష్ట ప్రశ్నకు నిర్మల్ సమాధానమిస్తూ, “‘జన నాయగన్’కు లభించే ప్రతి మద్దతును మేము స్వాగతిస్తాము. పొత్తుల గురించి మా పార్టీ అధినేత విజయ్ మాత్రమే నిర్ణయిస్తారు” అని అన్నారు.
ఇదిలా ఉండగా, ‘జన నాయగన్’ నిర్మాతలు త్వరితగతిన విచారణ కోరడంతో సీబీఎఫ్సీ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. అయితే, సీబీఎఫ్సీ ఒక వృత్తిపరమైన సంస్థ అని చెబుతూ, ఇందులో తమకు ఎలాంటి పాత్ర లేదని బీజేపీ పేర్కొంటోంది.


