న్యూఢిల్లీ: మొన్నటివరకు రామమందిరం చుట్టూ సాగిన ప్రచారం…అంటే బాబ్రీ మసీదు కూల్చివేత; బీజేపీకి, దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కు ఎన్నికల పరంగా గొప్ప ప్రయోజనాలను చేకూర్చింది. తరువాత కాశీ, మథుర వరుసలో ఉన్నాయి. ఇక తాజాగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ (సోమనాథ్ ఆత్మగౌరవ ఉత్సవం)తో ఇప్పుడు ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు…
ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి రెండు విషయాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా పేర్కొన్నారు. ఒకటి, సోమనాథ్ ఆలయం భారతదేశ కీర్తికి చిహ్నంగా నిలిచినందున, ముస్లిం రాజులు దానిపై పదేపదే దాడి చేశారని, కానీ అది మరింత గొప్ప వైభవంతో తిరిగి పుంజుకుందని అన్నారు. మహమూద్ గజనీ 1026లో దానిని ధ్వంసం చేసి 17 సార్లు దోచుకున్నాడు. ఇక మోడీ చెప్పిన రెండవ విషయం… కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా ప్రస్తుత ప్రధానికి అత్యంత అయిష్టమైన వ్యక్తి అయిన జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఉంది, వారు దాని పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించారని ఆయన ఆరోపించారు.
ఏదైనా ప్రార్థనా స్థలం ఏ దేశానికైనా చిహ్నంగా నిలవగలదా అనేది సందేహాస్పదమే. జాతిపిత గాంధీ మనకు బోధించినట్లుగా, మతంలో అత్యంత ముఖ్యమైన భాగం దాని నైతిక విలువలే. మహమూద్ గజనీ విషయానికొస్తే, అతను దానిని దోచుకున్నాడు. ఇస్లాంలో విగ్రహారాధన అనుమతించరు కాబట్టి అతను మతపరమైన కారణాల కోసమే అలా చేశాడని అతని ఆస్థాన చరిత్రకారులు నొక్కి చెప్పారు. పర్షియన్ మూలాలైన అల్-ఉతాబి, అల్-బరూని, సోమనాథ్‌ను నిధుల గని అని పిలిచారు. ఈ సిద్ధాంతంలోని ప్రధాన లోపం ఏమిటంటే, విగ్రహాలను ధ్వంసం చేయడమే అతని లక్ష్యమైతే, గజనీ నుండి సోమనాథ్ వెళ్లే మార్గంలో ఉన్న అనేక విగ్రహాలను అతను ఎందుకు వదిలిపెట్టాడు?
సోమనాథ్పై ఈ దాడి వెనుక మహమూద్ గజనీకి అనేక ఉద్దేశాలు ఉండవచ్చు. ప్రాథమికమైనది సంపద; అది భారతదేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటి. రోమిలా థాపర్ (హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, పెంగ్విన్) ప్రకారం, అందులో 20000 బంగారు దీనార్లకు (నాణేలు) సమానమైన సంపద ఉంది. అతను దానిని 17 సార్లు దోచుకున్నాడని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇది ఒక ప్రసిద్ధ పురాణం. అతను దోచుకున్న సంపదను అనేక ఏనుగులపై వేసి గజనీకి తీసుకువెళ్లారు.
తారిఖే బయాకి ప్రకారం… మహమూద్ సైన్యంలో తిలక్, సోంధి, హర్జాన్, హింద్ లాంటి అనేక హిందూ సేనాధిపతులు ఉన్నారు. మహమూద్ వారసుడు మసూద్ తన సైన్యంలోని సేనాధిపతులలో ఒకరైన తిలక్ నాయకత్వంలో మధ్య ఆసియాలోని ఒక మసీదు నుండి సంపదను దోచుకోవడానికి తన సైన్యాన్ని పంపాడు. గజనీ సోమనాథ్ నుండి బయలుదేరేటప్పుడు స్థానిక హిందూ రాజులలో ఒకరిని తన గవర్నర్‌గా నియమించాడు. అతను సంస్కృత పదాలతో కూడిన నాణేలను కూడా జారీ చేశాడు. అంతేకాకుండా, థానేశ్వర్ రాజు ఆనందపాల్ అతనికి ఏనుగులు, సైనికులను పంపి సహాయం చేశాడు.
ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో దేవాలయాల విధ్వంసం ప్రధానంగా మతపరమైన దృగ్విషయం కాదు. మొఘల్ పూర్వ భారతదేశంలో దేవాలయాల విధ్వంసంపై తన పరిశోధనలో రిచర్డ్ ఈటన్, ఇద్దరు హిందూ రాజుల మధ్య జరిగిన యుద్ధంలో విజేత అయిన హిందూ రాజు ఓడిపోయిన రాజు గారి కులదైవం విగ్రహాన్ని కూల్చివేసి, అక్కడ తన సొంత కులదైవాన్ని ప్రతిష్ఠించేవాడని మనకు చెబుతాడు.
కాగా, ఖిల్జీ, ముల్తాన్‌కు చెందిన అబ్దుల్ ఫత్ దావూద్ మధ్య జరిగిన పోరాటంలో ఒక మసీదు ధ్వంసం అయింది. రాజులకు మతాన్ని ముడిపెట్టడం బ్రిటిష్ వారితో ప్రారంభమైంది, వారు ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరించడానికి భారతదేశంలో మతతత్వ చరిత్ర రచనను ప్రవేశపెట్టారు. జేమ్స్ మిల్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ ఇండియా’ పుస్తకం నుండి ఇలియట్, డాసన్ల పుస్తకం ‘హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై హర్ హిస్టోరియన్స్’ వరకు, మతమే రాజుల పాలనకు కేంద్ర సూచికగా ఉంది.
ఇక ప్రధాని మోడీ రాజకీయాలు ఈ కొత్త విభజనవాద కోణాన్ని తెరుస్తున్నాయి. ఈ కథనంలో నెహ్రూను కూడా ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. నెహ్రూ సోమనాథ్ పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. అది అబద్ధం. ఈ విషయం గాంధీ జీవించి ఉన్నప్పుడే వచ్చింది. దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించకూడదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రామమందిరం నిర్మాణం గురించి ప్రణాళిక వేస్తున్నప్పుడు సుప్రీం కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో గాంధీ, నెహ్రూ, పటేల్ ఏకాభిప్రాయంతో ఉన్నారు. 1947 నవంబర్ 28న జరిగిన ప్రార్థనా సమావేశంలో, దేవాలయ నిర్మాణానికి జునాగఢ్ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వ నిధులను ఇవ్వజాలదని ఆయన పేర్కొన్నారు.
సోమనాథ్ ఆలయ నిర్మాణానికి ఏమైనా నిధులు ఇస్తున్నారా అని గాంధీ సర్దార్ పటేల్‌ను అడిగారు. నేను బ్రతికి ఉన్నంత వరకు అలాంటిది జరగదని, పునర్నిర్మాణం కోసం విరాళాలు ప్రజల నుండి సేకరిస్తామని పటేల్ బదులిచ్చారు. దీని ప్రకారం, సర్దార్ పటేల్ చైర్మన్‌గా, కె.ఎం. మున్షీ, గాడ్గిల్ ట్రస్టీలుగా ఒక ట్రస్ట్ ఏర్పడింది, అది ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేసింది. ఈ తప్పుడు ప్రచారం ఇక్కడితో ఆగదు. ఆ తర్వాత ఆలయ ప్రారంభోత్సవం వచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను ఆలయాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించారు. దీని గురించి నెహ్రూను అడిగారు. మార్చి 2, 1951న నెహ్రూకు రాసిన లేఖలో రాజేంద్ర ప్రసాద్, తాను వ్యక్తిగత హోదాలో ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెళ్లాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నెహ్రూ అన్నారు. ఇదే విషయాన్ని నెహ్రూ మార్చి 11, 1951న సి. రాజగోపాలాచారికి కూడా తెలిపారు. (పీయూష్ బబేలే ప్రకారం)
పీయూష్ బబేలే సాక్ష్యాధారాల ఆధారంగా పూర్తి నిజాన్ని స్పష్టం చేశారు. రామాలయానికి సంబంధించిన కార్యక్రమాలకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రస్తుత ప్రధానమంత్రిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్పష్టంగా, ఈ ఇద్దరు రాష్ట్రపతులను రామాలయ శంకుస్థాపన,ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు, ఎందుకంటే ఒకరు దళితుడు, మరొకరు ఆదివాసి!
చరిత్రకు సంబంధించిన ఒక అనుబంధ అంశంపై, జాతీయ భద్రతా సలహాదారు వంటి ఉన్నత పదవిలో ఉన్న అజిత్ దోవల్, ఢిల్లీలో ఒక యువజనోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా ఓ తిరోగమన సలహా ఇచ్చారు. ఆయన ప్రకారం… మన దేవాలయాలను దోచుకున్నారు, మన గ్రామాలను కొల్లగొట్టారు, కాబట్టి ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది! ప్రతీకారం అనేది ఆధునిక న్యాయ వ్యవస్థలో భాగం కాదా అనేది ప్రశ్న. ఇది మధ్యయుగ కాలం నాటి విషయం.
ప్రతి నేరానికి దోషులకు శిక్ష పడాలి. నిర్దోషులకు రక్షణ కల్పించాలి. మరి ఆయన ప్రస్తావిస్తున్న ఆరోపిత నేరాలకు ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలి? ముస్లిం, హిందూ రాజులచే దేవాలయాల విధ్వంసానికి, ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలి? ఆయన ప్రస్తావించని చరిత్రలో మరెన్నో అకృత్యాలు ఉన్నాయి. బౌద్ధ విహారాలు ధ్వంసం అయ్యాయి, జైన దేవాలయాలను పగులగొట్టారు. దళితులు, మహిళలపై అకృత్యాలు సర్వసాధారణంగా ఉండేవి. భర్త చితిపై భార్యను సజీవ దహనం చేసే సతీ సహగమన సంప్రదాయం ఉండేది. వీటన్నింటికీ ఎవరు ప్రతీకారం తీర్చుకోవాలి?
చరిత్ర అనేది సమాజాన్ని విభజించడానికి, గతం నాటి అన్యాయాలను కొనసాగించడానికి ఒక సాధనం కాదు. గతంలో జరిగిన ఏ తప్పులు మళ్లీ జరగకూడదో మనకు చూపించడానికి అది ఉంది. మనమందరం గౌరవ మర్యాదలతో జీవించే ఒక న్యాయమైన సమాజం వైపు ముందుకు సాగాలి. సమాన పౌరసత్వ హక్కులను అనుభవించే సమాజం మనది.


