హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పౌర-సైనిక సమన్వయ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. భారత సైన్యానికి చెందిన సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని పుణే నుండి హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం అభ్యర్థించారు.
అంతేకాదు సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యలను వేగంగా పరిష్కరించడంపై చర్చలు జరిగాయి. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రెండు నుండి నాలుగు సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారని గుర్తుచేస్తూ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని ఆయన ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలలో తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించడంలో ముందుంటుందని ముఖ్యమంత్రి ఆర్మీ అధికారులకు తెలిపారు. దీనిలో భాగంగా, వికారాబాద్‌లో లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కోసం 3,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆయన చెప్పారు.
సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థించారు, నిరంతర చర్చల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించగలమని స్పష్టం చేశారు. మొత్తంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ- పుదుచ్చేరి, లక్షద్వీప్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూ-డామన్ కేంద్రపాలిత ప్రాంతాలను పరిధిలోకి తీసుకునే సదరన్ కమాండ్ హెడ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, సైన్యానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.


