న్యూయార్క్: ఇరాన్‌లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో… ఐక్యరాజ్యసమితిలో అమెరికా, ఇరాన్ రాయబారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. “ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు” తాము అండగా ఉంటామని అమెరికా పేర్కొంది. కాగా, అమెరికా జోక్యాన్ని “పాలన మార్పు”కు ప్రయత్నంగా ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను ఉద్దేశించి ట్వీట్లు చేయడం, వారిని “ఇరాన్ దేశభక్తులు” అని పిలవడం, నిరసనకారులను రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించడంతో ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య రగడ మొదలైంది.
కాగా, భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ… ఇరాన్ ప్రభుత్వంపై అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కానీ రోజుల తరబడి జరిగిన నిరసనలు తగ్గుముఖం పట్టడం, ఆందోళనకారులకు ఉరిశిక్ష అమలును ఇరాన్ వాయిదా వేయడంతో అమెరికా వేచి చూసే వైఖరిని స్వీకరించింది.
మరోవంక అమెరికా నిరసనకారులకు మద్దతు పేరుతో ఇరాన్‌లో పాలనను కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని, ఇది సైనిక జోక్యానికి దారితీస్తుందని ఇరాన్ చేసిన ఆరోపణలను అమెరికా రాయబారి వాల్ట్జ్ తోసిపుచ్చారు. “ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం గతంలో కంటే బలహీనంగా ఉందని తెలుసుకోవాలి, అందుకే వీధుల్లో ఇరాన్ ప్రజల శక్తి కారణంగా ఈ అబద్ధాన్ని ముందుకు తెస్తున్నారు. ఇరాన్ అధినేతలు తమ సొంత ప్రజలకు భయపడుతున్నారు” అని వాల్ట్జ్ అన్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ “ఈ సున్నితమైన సమయంలో గరిష్ట సంయమనం పాటించాలని, మరింత ప్రాణనష్టానికి దారితీసే లేదా విస్తృత ప్రాంతీయ ఉద్రిక్తతను రేకెత్తించే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు”.
కాగా, డిసెంబర్ 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని దుకాణదారులు జాతీయ కరెన్సీ పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దిగజారుతున్న జీవన పరిస్థితులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్‌లో నిరసనలు చెలరేగాయి. అవి క్రమంగా సామూహిక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మారాయి. ఈ ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ను ఆపేయడంతో ఇప్పుడిప్పుడే నిరసనలు తగ్గుముఖం పట్టాయి.
US envoy to UN, Mike Waltz, dismisses claims by Iran that the protests are "a foreign plot to give a precursor to military action"
— TRT World Now (@TRTWorldNow) January 15, 2026
TRT World's Frank Ucciardo has more pic.twitter.com/5cGXs4pGlt


