టెహ్రాన్: ఇటీవలి ఇరాన్ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి రెండు ప్రశ్నలు కీలకమైనవి. అందులో ఒకటి ఇరాన్‌పై విధ్వంసకర దాడిని అమెరికా ప్రారంభించకుండా అరబ్ దేశాలు నిరోధించాయా? ఇరాన్ చేతిలో పెద్ద అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్వయంగా భయపడ్డారా? ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం అవసరమైతే…”అవును! అదే నిజం.”
ఇరాన్‌పై దాడికి తాము మద్దతు ఇవ్వబోమని అరబ్ దేశాలు అమెరికా (యుఎస్ఎ)కి స్పష్టం చేయడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండవచ్చు. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, ఈజిప్ట్ దేశాలు సమిష్టిగా దౌత్య స్థాయిలో అమెరికా-ఇరాన్‌లను సంప్రదించి 48 గంటలు దీనిపై పనిచేశాయని వివిధ నివేదికలు, నిపుణుల విశ్లేషణల అధ్యయనం వెల్లడిస్తుంది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం సముచితం కాదని, ఈ ప్రాంత భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఈ దేశాలు ట్రంప్‌కు తెలిపాయి. ఈ దేశాల సంధానకర్తలు ఇది వారి స్వంత దేశాల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుందని ట్రంప్‌కు అర్థమయ్యేలా చేశాయి.
ప్రస్తుతానికి, అరబ్ దేశాలు ఈ వైఖరిని ఎప్పుడు స్వీకరించాయో చెప్పడం కష్టం – అమెరికా దాడి చేస్తే, ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను దాడి చేస్తామని ఇరాన్ బెదిరింపు తర్వాతనా? లేదా ఈ అరబ్ దేశాలు ముందుగానే ఈ విధానాన్ని రూపొందించాయా? ఖతార్ విషయానికొస్తే… అర్థం చేసుకోవడం సులభం. ఖతార్ అల్-ఉదైద్‌లో అమెరికా అతిపెద్ద సెంట్రల్ కమాండ్ సైనిక స్థావరం ఉంది. జూన్ 23, 2025న ఇరాన్ అమెరికన్ “వైమానిక స్థావరం”పై క్షిపణులను ప్రయోగించిన ప్రదేశం ఇదే. వాస్తవానికి ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దూకుడు దాడులకు, ఇరాన్ లోని ముఖ్యమైన సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఈ క్షిపణులను ప్రయోగించారు. ఖతార్ దీనికి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ… ఈ దాడులు ఖతార్‌కు వ్యతిరేకంగా కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. తరువాత, సెప్టెంబర్ 9, 2025న, ఇజ్రాయెల్ ఖతార్‌లో ఉన్న పాలస్తీనా నాయకత్వంపై దాడి చేసింది. ఈ పరిస్థితి ఖతార్‌కు ఆందోళనకరంగా మారింది. అందువల్ల, ఇరాన్‌పై అమెరికా దాడుల గురించి ఖతార్ ఆందోళన చెందడం సహజం.
ఇక ఒమన్… అమెరికా-ఇరాన్ రెండింటితోనూ స్నేహపూర్వక సంబంధాలను నెరుపుతోంది. అందుకే గత సంవత్సరం ఒమానీ రాజధాని మస్కట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య అనేక రౌండ్ల అణు చర్చలు జరిగాయి. తరువాత, ఇజ్రాయెల్ ఇరానియన్ సంధానకర్తలపై దాడి చేసి చంపినప్పుడు, ఇరాన్ ఈ చర్చలను నిలిపివేసింది. ఇజ్రాయెల్ ఎటువంటి శాంతి ప్రయత్నాలను ఇష్టపడదని, ఇరాన్‌ను ఎలాగైనా నాశనం చేయాలని కోరుకుంటుందని అరబ్ దేశాలకు స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా పాత్రను సమీక్షించడం కూడా అవసరం. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్… దౌత్య, ఆర్థిక, రాజకీయ స్థాయిలలో ఒక విభిన్నమైన విధానాన్ని అవలంబించారు. ఆయన విధానాలన్నింటికీ మూలస్తంభం ఆయన ‘విజన్ 2030’. దీని కింద, ఆయన సౌదీ అరేబియాలో సమగ్ర మార్పులు చేశారు. ప్రతి రంగంలోనూ ఒక విప్లవాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పని చేస్తున్నారు. ఇరాన్‌తో దౌత్య సంబంధాల పునఃస్థాపన కూడా ఈ ప్రక్రియలో ఒక భాగమే. ఈ అంశాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు చాలా కాలం పాటు మంచిగా ఉన్నప్పటికీ, సుదీర్ఘ కాలంగా అవి క్షీణించాయన్నది కూడా నిజం. అయితే, మార్చి 10, 2023న, రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది.
ఈ ఒప్పందం నిస్సందేహంగా సౌదీ అరేబియా ఉదారతకు, ఇరాన్ ఉన్నత భావాలకు నిదర్శనం. ఐక్యరాజ్యసమితితో సహా అనేక దేశాలు ఈ ఒప్పందంపై ఆనందం, సంతృప్తిని వ్యక్తం చేశాయి. అమెరికా కూడా – జాగ్రత్తగా పదాలను ఉపయోగిస్తూనే – ఈ ఒప్పందంపై సానుకూల స్పందనను వ్యక్తం చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని ఇష్టపడకపోవడమే కాకుండా, దానికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించిన ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో, ఈ ఒప్పందం అతిపెద్ద ప్రభావం ఏమిటంటే… మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా ముస్లిం దేశాలలో అమెరికా రాజకీయ, సైనిక ఆధిపత్యం ముప్పును ఎదుర్కొంది. ఎందుకంటే ఈ ఒప్పందం చైనా ప్రయత్నాల ద్వారా సాధ్యమైంది.
సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య ఉన్న విభేదాల తీవ్రతను బట్టి చూస్తే, ఇరు దేశాల మధ్య సంబంధాలను నెలకొల్పడం అత్యంత కష్టమైన పనిగా అనిపించిందని అంగీకరించడంలో అతిశయోక్తి లేదు. అటువంటి పరిస్థితిలో, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాల పునరుద్ధరణ ఒక పెద్ద చారిత్రాత్మక ముందడుగు. సౌదీ అరేబియా కేవలం తన రాజకీయ చతురతను నిరూపించుకోవడానికి మాత్రమే ఈ ఒప్పందంలోకి ప్రవేశించలేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆధునిక ఆలోచనల ఆధారిత ఆర్థిక , సామాజిక సంస్కరణలే దీని వెనుక ప్రేరణ అని పరిశీలకులు విశ్వసించారు. ఇరాన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని తాము భావిస్తున్నామని సౌదీ ఆర్థిక మంత్రి అన్నారు.
అంతేకాదు సౌదీ అరేబియా ఇరాన్‌ను పదేపదే “సోదర దేశం” అని పేర్కొంది. అమెరికన్ పత్రిక టైమ్ మార్చి 15, 2023 సంచికలో— 2021 నుండి ఇరాన్, సౌదీ అరేబియా మధ్య… ఇరాక్ , ఒమన్‌లలో చర్చలు జరుగుతున్నాయని రాసింది. కానీ, ఆశ్చర్యకరంగా, ఈ చర్చల గురించి అమెరికాకు గానీ, ఇజ్రాయెల్‌కు గానీ ఎలాంటి సమాచారం అందలేదు. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ ప్రకటించినప్పుడు తెలసుకుని ఇజ్రాయెల్ దిగ్భ్రాంతికి గురైంది.
ఈ విషయంలో మనం ఆత్మసంతృప్తి చెందడానికి తొందరపడాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ను, ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహులను ఇంకా నమ్మడానికి వీల్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి, ఇదంతా అరబ్ దేశాల వివేకం, ఇరాన్‌తో వారు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం వల్లే జరిగిందని చెప్పవచ్చు.
ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల ప్రస్తావన కూడా అవసరం. నిస్సందేహంగా ఈ నిరసనలు చట్టబద్ధమైనవి. అక్కడి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. పేదరికం, నిరుద్యోగం కూడా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అందువల్ల, నిరసన ప్రదర్శనలను తప్పు అనలేము. దశాబ్దాలుగా ఇరాన్‌పై విధించిన ప్రపంచ ఆంక్షలు ఈ సమస్యలలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, ఇరాన్ రాజకీయ నాయకత్వం ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ విషయాన్ని అక్కడి ఉన్నత మత నాయకత్వం కూడా అంగీకరించింది. సుప్రీం లీడర్ ఖమేనీ స్వయంగా నిరసనకారుల ఆర్థిక డిమాండ్లు చట్టబద్ధమైనవని అన్నారు.
అయితే ఈ నిరసనల దిశ అకస్మాత్తుగా ఆర్థిక విషయాల నుండి రాజకీయ విషయాల వైపు ఎలా మళ్లింది? దీనికి సమాధానం కనుగొనడం కష్టం కాదు. ఇరాన్‌లో హింసాత్మక నిరసనలను ప్రోత్సహించడంలో ఇజ్రాయెల్ ప్రధాన పాత్ర పోషించిందని ఇజ్రాయెల్ దౌత్య, రాజకీయ, పత్రికా వర్గాలు కూడా అంగీకరించాయి. ఇజ్రాయెల్ ఏయే రంగాలలో ఇరాన్‌లోకి చొరబడింది, దాని ఏజెంట్లు అక్కడ అన్ని రకాల సహాయాన్ని అందించడంలో ఎలా విజయం సాధించారనే వివరాలతో అల్ జజీరా ఒక పరిశోధనాత్మక నివేదికను కూడా ప్రచురించింది. ఈ విషయంలో ఇజ్రాయెల్ అత్యంత ఉత్సాహంగా ఉంది. ఇరాన్ ప్రభుత్వం పతనమైతే, ఇరాన్ పరిపాలనను చేపట్టడానికి మాజీ నియంత రెజా షా పహ్లావి కుమారుడిని ముందుకు నెట్టడం కూడా ప్రారంభించింది. అందువల్ల, యుద్ధం నివారించారనే వార్త ఇజ్రాయెల్‌కు ఆత్మను కుదిపేసే దుఃఖానికి మూలం కంటే తక్కువ కాదు.
మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను… ఇరాన్ పట్టుదలతో ఎదుర్కొన్న తీరు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గత సంవత్సరం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇరాన్‌కు ఫైటర్‌జెట్లు లేవు. ఇప్పుడు వైమానికి శక్తి విషయంలో ఇరాన్ బలహీనంగా లేదని నివేదికలు సూచిస్తున్నాయి. కానీ ఇప్పుడు రష్యా, చైనా సహాయంతో అది కొన్ని ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసిందని వినికిడి. అలాగే క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను కూడా గణనీయంగా పెంచుకుంది. ఇజ్రాయెల్‌తో యుద్ధ సమయంలో, దాని క్షిపణులు ఇప్పటికే ఇజ్రాయెల్‌ను భయపెట్టాయి. ఇరాన్ ఇజ్రాయెల్ లోపల పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు అన్ని ఆంక్షలు , అమెరికన్ దాడులు ఉన్నప్పటికీ ఇరాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని కూడా పెంచిందని వినికిడి. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ప్రతిచర్యను ఎదుర్కోవలసి ఉంటుందని ఇరాన్ నాయకత్వం హెచ్చరించింది.
మరోవంక ఇరాన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ వివిధ మార్గాలను ఉపయోగించారు; వాస్తవానికి, ఈ ధోరణి (ఎక్స్‌లో నడుస్తున్న ధోరణి) ఇరాన్ వెలుపలి ఖాతాల నుండి, ముఖ్యంగా ఇజ్రాయెల్,దాని శ్రేయోభిలాషుల వర్గాల నుండి నడపించారు. మొత్తంగా ఇజ్రాయెల్ తన మనుగడకు ఇరాన్‌ను శాశ్వత ముప్పుగా భావిస్తుంది. అమెరికా దానిని ఈ ముప్పు నుండి శాశ్వతంగా కాపాడాలని కోరుకుంటోంది. అందువల్ల, ప్రస్తుత ప్రశాంత పరిస్థితిని శాశ్వతమైనదిగా భావించడం పెద్ద పొరపాటు అవుతుంది.


