భోపాల్: ఏ దేశానికైనా నిజమైన బలం దాని విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఉంది. గ్రామ పంచాయతీ నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉన్నప్పటికీ, ద్వేషంతో మాత్రమే పాఠశాల భవనాన్ని కూల్చివేయడం దేశ పురోగతికి పెద్ద ఎదురుదెబ్బ. తమ పౌరులను అవమానించడమే అవుతుంది. నేతలు తమ ప్రజల శ్రేయస్సు కంటే విభజన, ద్వేషపూరిత అజెండాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని ఓ సామాజిక కార్యకర్త వాపోయారు.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా, భైన్స్‌దేహి తహసీల్‌లో ఉన్న ధాబా గ్రామంలో ఇటీవల జరిగిన ఒక సంఘటనకు సంబంధించి భోపాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీమతి రజియా మసూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల జనాభా ఉన్నారు. అందులో కేవలం నాలుగు ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. సమీప పాఠశాల గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒక మంచి ఉద్దేశ్యంతో, గ్రామానికి చెందిన అబ్దుల్ నయీమ్ దళిత, గిరిజన పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించడానికి తన సంపాదన నుండి ₹20 లక్షలు ఖర్చు చేశారు. పిల్లలలో ఉన్న తీవ్రమైన విద్యాలోపాన్ని తీర్చడానికి, నయీమ్ నర్సరీ నుండి ఎనిమిదో తరగతి వరకు తరగతులు ప్రారంభించాలని ప్రణాళిక వేశారు.
అయితే కొన్ని రోజుల క్రితం…నయీమ్ ఒక “చట్టవిరుద్ధమైన మదర్సా” నిర్మించారని, పిల్లలకు “అనధికారిక” విద్యను అందిస్తున్నారని ఒక పుకారు వ్యాపించింది. గ్రామస్తుల వాదన ప్రకారం… తహసీల్దార్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM), స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విచారణకు వచ్చి పాఠశాలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు నయీమ్‌ను పంచాయతీ నుండి నిరభ్యంతర పత్రం పొందమని కూడా కోరారు.
నయీమ్ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు, అతని దరఖాస్తును తిరస్కరించి, మరో రోజు రమ్మని చెప్పారు. తన భూమి పత్రాలన్నీ సరైనవని, అలాగే డిసెంబర్ 30, 2025 నుండి పాఠశాలను నడపడానికి అనుమతి కోసం పాఠశాల విద్యా విభాగానికి దరఖాస్తు కూడా సమర్పించానని నయీమ్ చెప్పారు.
అయినప్పటికీ అతని భవనాన్ని కూల్చివేయడానికి ఒక ఉత్తర్వు జారీ చేశారు. గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని నిరసించినప్పుడు, పంచాయతీ హడావిడిగా భవనానికి నిరభ్యంతర పత్రం జారీ చేసింది. అయితే ఓ సాయంత్రం సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)నయీమ్‌తో “పై నుండి చాలా ఒత్తిడి ఉంది, పాఠశాలను కూల్చివేయక తప్పదు” అని చెప్పారు. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా విలువ లేకుండా పోయింది. ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, జరిమానా చెల్లించడం ద్వారా దాన్ని సరిదిద్దవచ్చని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. భవనాన్ని కూల్చివేయకూడదని ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది, వారు చదువుకోకుండా నిరోధిస్తుందని వారు ఎంత మొత్తుకున్న లాభం లేకపోయింది.
ఎన్‌ఓసి జారీ చేసిన తర్వాత కూడా కూల్చివేత ఉత్తర్వును జారీచేయడంతో గ్రామస్తులు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కలెక్టర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే నయీమ్‌తో పాటు వందలాది మంది గ్రామస్తులు బేతుల్ కలెక్టర్ కార్యాలయానికి మెమోరాండం సమర్పించడానికి చేరుకోగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
మరుసటి రోజు, వందలాది మంది గ్రామస్తులు నయీమ్‌తో పాటు బేతుల్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు, కానీ పోలీసులు వారిని మార్గమధ్యలో అడ్డుకున్నారు. చాలా గంటలు నిలుపుదల చేసిన తర్వాత, చివరకు వారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తమ కేసును సమర్పించడానికి అనుమతించారు. కలెక్టర్ విచారణకు హామీ ఇచ్చారు, అయితే ఈలోగా, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) భవనం కూల్చివేశారు.
తరువాత, బేతుల్ జిల్లా అధికారి ఒక వీడియో బయటకు వచ్చింది, అందులో పంచాయతీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసిన తర్వాత కూడా పాఠశాల భవనం కూల్చివేతను ఆయన సమర్థిస్తున్నట్లు ఉంది. మరుసటి రోజు, జిల్లా అధికారి నుండి మరొక అధికారిక ప్రకటన విడుదలైంది, దీనిలో ఆయన మళ్ళీ బుల్డోజర్ చర్య చట్టబద్ధమైనదని సమర్థించారు.
అయితే, పంచాయతీ నుండి NOC పొందిన తర్వాత కూడా పాఠశాల భవనం ఎందుకు కూల్చివేశారనే దానిపై ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఈ రకమైన మతతత్వ మతోన్మాదం, జాత్యహంకార అణచివేత ధోరణి… అణగారిన వర్గాల విద్యను అణగదొక్కుతుందని సామాజిక కార్యక్త శ్రీమతి రజియా మసూద్ నొక్కిచెప్పారు. ద్వేషపూరిత భావజాలం పేరుతో పాఠశాలలను నాశనం చేయడం, విశ్వవిద్యాలయాలను మూసివేయడం లాంటి చీకటి యుగాన్ని మనం చూస్తున్నాము. ఇటువంటి ద్వేషపూరిత అన్యాయాలను ఖండించి, నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.


