హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో సమన్వయ కమిటీకి నియమించిన అధికారుల జాబితాకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ప్రాజెక్టులో జాప్యంపై తన ఆందోళనలను వ్యక్తం చేస్తూ… కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జనవరి 16న తనకు రాసిన లేఖకు ఆయన ఈ విధంగా స్పందించారు.
మొదటి దశను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, రెండో దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండో దశపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒక సంయుక్త కమిటీ ద్వారా సమన్వయం చేసుకుంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కమిటీకి ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని తెలంగాణను కోరినప్పటికీ, ఇప్పటివరకు పంపలేదని ఆయన అన్నారు.
మంత్రి కిషన్‌రెడ్డి లేఖపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సంయుక్త కమిటీకి తెలంగాణ నుండి అధికారులను నామినేట్ చేస్తూ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు డిసెంబర్ 12న, మళ్లీ జనవరి 17న లేఖలు పంపినప్పటికీ, అవి ఇంకా ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మెట్రో రెండో దశను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి వీలుగా ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు.


