న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, అది ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలిపే ఆర్థిక ప్రణాళిక. ఇది దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం, వనరుల కేటాయింపు, ఆదాయ పన్నుల వంటి కీలక విధానాలను ఈ బడ్జెట్ నిర్దేశిస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
దేశంలో ఉపాధిని పెంచాలని, సంపద పంపిణీని మెరుగుపరచి, డిమాండ్-దిశగా వృద్ధిని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేంద్రానికి సూచించింది. ఈమేరకు 2026–27 కేంద్ర బడ్జెట్ కోసం భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు వివరణాత్మక మెమోరాండంను సమర్పించింది. ఇందులో భాగంగా…భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరించే లక్ష్యంతో JIH మరోసారి ప్రభుత్వం ముందు పలు సిఫార్సులను ఉంచింది.
భారతదేశ ఇటీవలి ఆర్థిక పనితీరు ప్రకారం… స్థిరమైన GDP వృద్ధి, విస్తరిస్తున్న ఆర్థిక మార్కెట్లు, పెరుగుతున్న కార్పొరేట్ లాభదాయకతలో సంపద సృష్టికి దేశం బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పటికీ – ఈ లాభాలు దామాషా ప్రకారం సమానంగా పంపిణీ కాలేదని, తగినంత ఉపాధి సృష్టి జరగలేదని జమాత్ పేర్కొంది. కాగా, ఆదాయం, సంపద సూచికలు… బలహీనమైన ఉద్యోగ కల్పన, పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక విధాన సంస్కరణల అవసరాన్ని హైలైట్ చేస్తాయి. ఆహారం, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, విద్య వంటి ముఖ్యమైన వస్తువులపై పెరుగుతున్న గృహ వ్యయం వినియోగం, దేశీయ డిమాండ్‌ను మరింత పరిమితం చేసింది.
ఈ నేపథ్యంలో ఆర్థిక విధాన రూపకల్పనలో ఉపాధి ఫలితాలను స్పష్టంగా పొందుపరచాల్సిన అవసరాన్ని జమాత్ సూచనలు నొక్కి చెబుతున్నాయి. ఉపాధి ఫలితాలను మెరుగుపరచడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రజా క్రెడిట్ మద్దతును పునఃరూపకల్పన చేయాలని కూడా సిఫార్సులు కోరుతున్నాయి. క్రెడిట్ ప్రోత్సాహకాలను… ఉద్యోగ సృష్టికి, ముఖ్యంగా మహిళలకు లింక్ చేయడం ద్వారా సామాజిక రాబడిని పెంచవచ్చని జమాత్ సూచించింది. అదేవిధంగా, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలను కార్మిక-ఇంటెన్సివ్ రంగాల వైపు తిరిగి మళ్ళించాలని కేంద్రాన్ని కోరింది.
ఇక వ్యవసాయ రంగంలో ఆదాయ అస్థిరత గ్రామీణ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారిన నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీని ఆదాయ స్థిరీకరణకు మార్గంగా మలుచుకోవాలని జమాత్ సూచించింది. అంతేకాదు ధరల లోటు చెల్లింపులు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహకాలు, విస్తరించిన ఆఫ్-సీజన్ గ్రామీణ పనులు వంటి ఆదాయాన్ని మెరుగుపరిచే సాధనాల దిశగా మారాలని జమాత్ ప్రతిపాదనలు చేసింది.
కాగా, కేంద్ర బడ్జెట్ కోసం నిర్మాణాత్మక సూచనలను సమర్పించడం జమాత్ సామాజిక ప్రక్రియలో భాగమని ఆ సంస్థ పేర్కొంది. ఇతర ముస్లిం సంస్థలు, పౌర సమాజ సంస్థలకు కూడా తమ నిర్మాణాత్మక ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపాలని ఈ సందర్భంగా JIH విజ్ఞప్తి చేసింది. తద్వారా విభిన్న సామాజిక-ఆర్థిక అంశాలు జాతీయ బడ్జెట్ ప్రక్రియలో ప్రాతినిధ్యం వహిస్తాయని తెలిపింది.


