ఉడుపి: పర్యాయ ఊరేగింపు సందర్భంగా ఉడుపి డిప్యూటీ కమిషనర్ టి కె స్వరూప కాషాయ జెండా పట్టుకున్నారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ… తాను ఆ కార్యక్రమంలో తన అధికారిక హోదాలో పాల్గొన్నానని, తన వైపు నుండి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని అన్నారు.
జనవరి 18న పర్యాయ ఊరేగింపును ప్రారంభించేటప్పుడు కాషాయ జెండా పట్టుకున్నందుకు స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెల్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు.
“జనవరి 18 ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటలకు, ఉడుపి శ్రీ కృష్ణ మఠం ద్వివార్షిక పర్యాయోత్సవ కార్యక్రమంలో భాగంగా… ఉడుపి నగర పాలక సంస్థ నిర్వాహకురాలిగా నా విధులలో భాగంగా నేను స్వామీజీ పురప్రవేశ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించాను. అదేవిధంగా, కొత్త పర్యాయ స్వామీజీకి పౌర సన్మాన కార్యక్రమంలో, స్వామీజీ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన తర్వాత జరిగిన దర్బార్ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను” అని స్వరూప తన ప్రకటనలో తెలిపారు.
జనవరి 18న జరిగిన పర్యాయోత్సవం, ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయం ఆచార, పరిపాలనా నియంత్రణను శిరూర్ మఠానికి లాంఛనప్రాయంగా బదిలీ చేయడాన్ని సూచిస్తుంది, శ్రీ వేదవర్థన తీర్థ స్వామీజీ 2026-28 కాలానికి దేవాలయానికి పీఠాధిపతి-నిర్వాహకుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈమేరకు ఉడుపి జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సెల్ అధ్యక్షుడు హరీష్ శెట్టి మాట్లాడుతూ… జనవరి 18 ఉదయం, జోడు కట్టె నుండి కృష్ణ మఠం వరకు జరిగిన ఊరేగింపుకు ముందు, ఉడుపి బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ “ఆర్‌ఎస్‌ఎస్ జెండాను డీసీకి అందించారని, దానిని ఆమె బహిరంగంగా పైకి ఎత్తి ఊపారని” పేర్కొన్నారు.
ఈ ఘటన ప్రభుత్వ అధికారి సేవా నిబంధనలకు, రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నందున… డిప్యూటీ కమిషనర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. దీనిపై విచారణ జరిపి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉడుపిలోని ‘పర్యాయ’ వ్యవస్థ అనేది ఒక సంప్రదాయం. దీని ప్రకారం… ఆలయ నిర్వహణను అష్ట (ఎనిమిది) మఠాలైన పెజావర, పుట్టిగె, అడమారు, కృష్ణపుర, శిరూర్, సోధె, కనియూర్ మరియు పలిమారు మఠాలు నిర్వహిస్తాయి, ఒక్కో మఠం రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ వ్యవస్థను 13వ శతాబ్దపు తత్వవేత్త-సన్యాసి, ద్వైత తత్వశాస్త్ర స్థాపకుడైన శ్రీ మధ్వాచార్యుల వారు ప్రవేశపెట్టారు.


