న్యూఢిల్లీ: నేడు బిలియనీర్ల సంపద స్థాయి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉంది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 3,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలిపింది.
2020 నుండి సంపన్నుల ఆస్తులు విపరీతంగా పెరగగా, పేదరికం నిర్మూలనకు ఇంకా 200 ఏళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్త అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పేర్కొంది.
జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల వద్ద జనాభాలో ఉన్న సగం మంది వద్ద ఉన్నదాని కంటే 8,251 రెట్లు ఎక్కువ సంపద ఉంది. మానవాళిలో అత్యంత పేదల దగ్గర ప్రపంచ సంపదలో కేవలం 0.52% మాత్రమే ఉంది.
ఈ వాస్తవాలన్నీ నిజమేనని, దావోస్‌లో విడుదలైన కొత్త ఆక్స్‌ఫామ్ నివేదిక ఎత్తిచూపుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు – ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు… హక్కులు-స్వేచ్ఛ కంటే సంపదను రక్షించడానికి ఎంచుకుంటున్నాయి. బిలియనీర్ల సంపద పెరగడమే కాకుండా, వారి రాజకీయ అధికారం కూడా పెరిగింది – నవంబర్ 2024లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుండి గత ఐదేళ్లలో బిలియనీర్ల సంపద సగటు వార్షిక రేటు కంటే మూడు రెట్లు వేగంగా పెరిగింది
ఇదిలా ఉండగా, పేదరిక నిర్మూలన కూడా నిలిచిపోయింది: “పేదరిక నిర్మూలన చాలా వరకు ఆగిపోయింది, ఆఫ్రికాలో పేదరికం మళ్లీ పెరిగింది. 2022లో, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (48%), అంటే 3.83 బిలియన్ల మంది పేదరికంలో నివసిస్తున్నారు,” అని నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా నిరంకుశత్వం పెరగడం, తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలతో నేరుగా ముడిపడి ఉందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ధనికులు మరింత ధనవంతులు అవుతున్న కొద్దీ, వారు రాజకీయంగా కూడా మరింత శక్తివంతులు అవుతున్నారు: “136 దేశాల నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆర్థిక వనరులు ఎంత అసమానంగా పంపిణీ అయితే, రాజకీయ అధికారం కూడా అంతే అసమానంగా పంపిణీ అవుతుంది. ఇది తక్కువ ఆదాయ వర్గాల వారి కంటే ఉన్నత ఆదాయ వర్గాల వారి ప్రాధాన్యతలను ప్రతిబింబించే విధాన ఫలితాలకు దారితీస్తుంది.”
“సంపన్నులు మూడు ప్రధాన మార్గాల ద్వారా తమ రాజకీయ అధికారాన్ని నిర్మించుకున్నారు: రాజకీయాలను కొనడం ద్వారా, ఉన్నత వర్గాల అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా, సంస్థలను నేరుగా ప్రభావితం చేయడం ద్వారా,” అని నివేదిక పేర్కొంది. ఈ రాజకీయ అధికార కేంద్రీకరణ.. ఆర్థిక అసమానత, రాజకీయ అసమానతను పెంచుతోంది.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మానవ మూలధన (విద్య, ఆరోగ్యం, నైపుణ్యం) అసమానతల్లో చాలామంది ఊహించిన దానికంటే భారీ తేడాలున్నాయి. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో చిన్నారుల విద్య కోసం చేస్తున్న ఖర్చు సగటు 200 యూరోలు (రూ.21 వేలు)కాగా, యూరప్‌లో దాదాపు 7,400 యూరోలు (సుమారు రూ.7.8 లక్షలు), ఉత్తర అమెరికా, ఓషియేనియా (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి దేశాలు) ప్రాంతాల్లో 9,000 యూరోలు, అంటే సుమారు రూ.9.5 లక్షలు అని రిపోర్టు పేర్కొంది. ప్రపంచ అసమానత నివేదిక భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాలలో ఒకటిగా పేర్కొంది.


