Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

77 ఏళ్ల గణతంత్రం: ముస్లింల గుండెల్లో భయం.. రాజ్యాంగం నీడలో అన్యాయం!

Share It:

దేశం 77వ గణతంత్ర దినోత్సవ ముంగిట ఉంది. ఎటు చూసినా త్రివర్ణ పతాకాలు, దేశభక్తి గీతాలు. కానీ, అదే జెండా నీడలో ఒక వర్గం పౌరులు తమ ప్రాణాల కోసం, ఆత్మగౌరవం కోసం విలవిలలాడుతున్నారు. గడిచిన రెండు వారాల రక్తచరిత్రను చూస్తే.. మనం జరుపుకునే ఈ వేడుకలు బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అనిపించడం లేదా?
రక్తసిక్తమైన వీధులు – మౌనమైన చట్టం
మొరాదాబాద్‌లో ఒక యువకుడిని సజీవ దహనం చేసినా, జార్ఖండ్‌లో గుంపులుగా చేరి మనిషిని వేటాడి చంపినా.. ఇక్కడ చట్టం నిద్రపోతోందా? లేక నేరగాళ్లకు వంత పాడుతోందా? ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, ఆ పైశాచికత్వాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ‘విజయ గర్వం’తో ప్రదర్శించడం ఏ రకమైన నాగరికత? ఇది మన రాజ్యాంగం కలగన్న భారతేనా?
హక్కుల అపహాస్యం
రాజ్యాంగం మనకు ప్రార్థించుకునే స్వేచ్ఛను ఇచ్చింది, కానీ ఇంట్లో నమాజ్ చేసుకుంటే కేసులు పెడుతున్నారు. నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు ఇచ్చింది, కానీ గడ్డం చూసి వేధిస్తున్నారు. వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, కానీ వీధుల్లో వస్తువులు అమ్ముకునే పేదవాడిని కూడా వదలడం లేదు. రాజ్యాంగం కేవలం పుస్తకాల్లోని అక్షరాలకే పరిమితమైతే, సామాన్యుడి ప్రాణాలకు భద్రత ఎక్కడ? న్యాయస్థానాల మౌనం అరాచక శక్తులకు ఆయుధంగా మారుతోంది.
మనల్ని మనం ప్రశ్నించుకుందాం!
మెజారిటీ వాదం మేకపోతు గాంభీర్యంతో విర్రవీగుతున్నప్పుడు, మైనారిటీల గుండెల్లో భయం గడ్డకట్టుకుపోతున్నప్పుడు.. ఈ పండుగలు ఎవరి కోసం? రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచం ముక్కలైపోతుంటే, మనం ఎగిరేసే జెండాకు అర్థం ఏముంటుంది?
దేశం అంటే సరిహద్దులు కావు, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల మధ్య ద్వేషపు గోడలు కట్టి, రక్తంతో నేలను తడిపి జరుపుకునే ఉత్సవం.. వేడుక కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ.
చివరగా….ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం రాజ్యాంగాన్ని చదువుదాం.. అందులో ఉన్న స్వేచ్ఛను, సమానత్వాన్ని మన తోటి మనిషికి అందిద్దాం. ద్వేషాన్ని వీడి, మనుషులుగా బతుకుదాం.
— ముహమ్మద్ ముజాహిద్

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.