హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఎన్నికలు ఒకే దశలో నిర్వహిస్తారు. కాగా, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని తెలిపారు.
నామినేషన్ల దాఖలు నేటినుంచి ప్రారంభమవుతుంది, నామినేషన్లకు చివరి తేదీ జనవరి 30. నామినేషన్ల పరిశీలన జనవరి 31న జరుగుతుంది. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11న ఓటింగ్ జరగనుంది. ఫలితాలు ఫిబ్రవరి 13న ప్రకటిస్తారు. చైర్మన్లు, మేయర్లను ఎన్నుకునే ప్రక్రియ ఫిబ్రవరి 16న జరుగుతుంది.
మొత్తం 2,996 వార్డులలో 52.43 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 136 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రకటన తర్వాత, తెలంగాణ అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిష్పాక్షికమైన, పారదర్శక ప్రక్రియ జరిగేలా పోలీసులు తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. రూ.50 వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు.


