టెల్‌అవీవ్ : గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు సాగించిన మారణహోమం దెబ్బకు 71,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని సీనియర్ ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) అధికారులు అంగీకరించారు. ఈమేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదహరించిన సంఖ్య ఖచ్చితమైనదని వారు మొదటిసారి అంగీకరించారు.
గతంలో ఈ మరణాల సంఖ్యను “నమ్మశక్యం కానిది”,”తప్పుదారి పట్టించేది” అని తోసిపుచ్చిన సీనియర్ సైనిక వర్గాలు… ఇజ్రాయెల్ వార్తాపత్రికలు హారెట్జ్, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లతో మాట్లాడుతూ… ఈ సంఖ్య సరైనదే అయినప్పటికీ, పోరాటంలో ప్రత్యక్షంగా ఎంత మంది పోరాట యోధులు, ఎంత మంది పౌరులు మరణించారో IDF విడదీయలేకపోయింది.
చనిపోయిన ప్రతి మిలిటెంట్‌తో పాటు ఇద్దరు లేదా ముగ్గురు పాలస్తీనియన్ పౌరులు మరణించారని IDF గతంలో చెప్పింది. 71,000 మందితో పాటు తప్పిపోయిన,శిథిలాల కింద ఖననం అయినవారిని, ఆకలితో మరణించిన వారిని కూడా IDF అధికారులు చేర్చలేదు.
ఇజ్రాయెల్ మీడియా తాజా నివేదికల తర్వాత… ప్రచురించబడిన వివరాలు అధికారిక ఐడిఎఫ్ డేటాతో సరిపోలడం లేదని ఒక సైనిక అధికారి తెలిపారు. “ఈ విషయంపై ఏదైనా ప్రచురణ మార్గాల ద్వారా విడుదల చేస్తామని” ఐడిఎఫ్ అధికారి హారెట్జ్,టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌తో అన్నారు.
అయితే, మరణాల సంఖ్యను ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంఖ్యలను నమ్మదగినవిగా పరిగణించాయి. 2023లో ముట్టడికి గురైన గాజా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ మారణహోమం ప్రారంభమైనప్పటి నుండి కొన్ని అధ్యయనాలు నిజమైన మరణాల సంఖ్య రెండు లక్షల వరకు ఉండవచ్చు అని చెప్పినప్పటికీ…గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ 71,667 మరణాలను నమోదు చేసింది. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెలీయులను చంపిన తర్వాత ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య రెండేళ్ల పాటు జరిగిన వివాదం ప్రారంభమైంది.
దీనికి ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ సైన్యం గాజాతో సహా పాలస్తీనా భూభాగాలపై భారీ బాంబు దాడి చేసింది. 2025 అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ తర్వాత కూడా, ఇజ్రాయెల్ చేతిలో 480 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అల్ జజీరా నివేదించింది.


