Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అమాయకపు గొంతుక ‘హింద్ రజబ్’… ప్రపంచాన్ని కదిలించిన ఓ చిన్నారి జ్ఞాపకం!

Share It:

గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల పాలస్తీనా చిన్నారి హింద్ రజబ్ జ్ఞాపకాలు నేటికీ ప్రపంచాన్ని కదిలిస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, స్పెయిన్‌లోని బార్సిలోనా సముద్ర తీరంలో వందలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. 55 మీటర్ల పొడవున్న ఆమె భారీ చిత్రపటాన్ని, పాలస్తీనా జెండాను అక్కడ ప్రదర్శించారు. ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ వారంతా కాసేపు నిశ్శబ్దంగా నిలబడి నివాళులర్పించారు.

ఆ రోజు ఏం జరిగింది?

రెండేళ్ల క్రితం 2023 అక్టోబర్ దాడి తర్వాత జరిగిన యుద్ధంలో హింద్ రజబ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. ఆ కారులో ఆమె అత్త, మామ, ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిమ్మచీకటి, చుట్టూ శవాలు.. ఆ భయానక స్థితిలో చిన్నారి హింద్ కారులోనే చిక్కుకుపోయింది. దాదాపు మూడు గంటల పాటు ఫోన్ ద్వారా సాయం కోసం ఆమె ఆర్తనాదాలు చేసింది. “నన్ను తీసుకెళ్లండి.. నాకు చాలా భయంగా ఉంది” అంటూ ఆమె చేసిన చివరి ఫోన్ కాల్స్ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆమెను కాపాడటానికి వెళ్లిన అంబులెన్స్ కూడా దాడికి గురైంది. 12 రోజుల తర్వాత హింద్, ఆమెను కాపాడటానికి వెళ్లిన ఇద్దరు వైద్య సిబ్బంది మృతదేహాలు అదే కారులో లభించాయి.

సినిమాగ మారిన చిన్నారి ఆవేదన:

హింద్ రజబ్ చివరి క్షణాల ఆధారంగా “The Voice of Hind Rajab” అనే సినిమాను తీశారు. ఈ సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గొప్ప పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా, ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. ఒక చిన్నారి గొంతు ప్రపంచ దేశాల మనస్సాక్షిని ఎలా తట్టిందో ఈ చిత్రం చూపిస్తుంది.

తల్లి ఆవేదన: ఈ కార్యక్రమంలో హింద్ తల్లి వెసామ్ హమదా మాట్లాడుతూ.. “మా పిల్లలు కోరుకునేది బాంబుల మోత లేని నిద్రను, భయం లేని బాల్యాన్ని మాత్రమే” అని కన్నీటి పర్యంతమయ్యారు. నేటికీ గజాలో కాల్పుల విరమణ జరిగినప్పటికీ, అక్కడి పిల్లలు ఆకలితో, సరైన వైద్యం అందక అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.