కోల్‌కత: బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీపార్టీ అధినేత తారిఖ్ రెహమాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వీట్లు, పూల బోకే పంపారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని గెలిపించినందుకు మమత బంగ్లాదేశ్ పౌరులను అభినందించారు, బిఎన్‌పి నాయకుడిని తారిఖ్ భాయ్ అని సంబోధించి పొరుగు దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మమతా బెనర్జీ తారిఖ్ రెహమాన్‌కు ఫోన్ చేసి తన పార్టీ విజయానికి అభినందనలు తెలిపారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫోన్ సంభాషణలో ఏమి చర్చించారో వెల్లడించలేదు. కాగా, బిఎన్‌పి మీడియా సెల్ సభ్యుడు అతికుర్ రెహమాన్, ఇతర సీనియర్ అధికారులు ఈ బహుమతులను అందుకున్నారని వర్గాలు తెలిపాయి.
అంతకుముందు, మమతా బెనర్జీ X పోస్ట్‌లో బీఎన్పీ పార్టీకి అభినందనలు తెలిపారు, “శుభోనందన్, బంగ్లాదేశ్‌లోని నా సోదరులు, సోదరీమణులందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వారందరికీ నా ముందస్తు రంజాన్ ముబారక్. ఈ గొప్ప విజయానికి, తారిఖ్-భాయ్, ఆయన పార్టీకి నా అభినందనలు. మీరందరూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో మన సంబంధాలు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాను.”
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా BNPని నిర్ణయాత్మక విజయం దిశగా నడిపించినందుకు ఆయనను ఫేస్బుక్ పోస్ట్‌లో రెహమాన్‌ను అభినందించారు.
“మిస్టర్ తారిఖ్ రెహమాన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆయన సాధించిన అద్భుతమైన విజయంపై నేను ఆయనకు అభినందనలు తెలియజేశాను. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన చేసిన ప్రయత్నంలో నా శుభాకాంక్షలు, మద్దతును తెలియజేశాను” అని మోడీ పోస్ట్ చేశారు.
“చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్న ఇద్దరు సన్నిహిత పొరుగువారిగా, మన రెండు దేశాల ప్రజల శాంతి, పురోగతి,శ్రేయస్సు పట్ల భారతదేశం నిరంతర నిబద్ధతను నేను పునరుద్ఘాటించాను” అని ప్రధాని మోదీ అన్నారు.
బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికలు గురువారం ముగిసాయి. తరువాత అధికారిక ఫలితాలను ప్రకటించారు. మొత్తం 297 సీట్లలో BNP, దాని మిత్రపక్షాలు 212 సీట్లను గెలుచుకున్నాయి. బంగ్లాదేశ్ జమాతే-ఇ-ఇస్లామి నేతృత్వంలోని 11 పార్టీల ఎన్నికల కూటమి 77 సీట్లను గెలుచుకుంది, ఇస్లామి ఆందోళన్ బంగ్లాదేశ్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు ఏడు సీట్లను గెలుచుకున్నారు.
