న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్‌ను భారతదేశానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. అంతేకాదు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడికి తన శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢాకాలో రెహమాన్‌ను కలిసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా … ప్రధాని మోడీ లేఖను అందజేసినట్లు అధికారులు న్యూఢిల్లీలో తెలిపారు.
కొత్త ప్రధాని రెహమాన్ నాయకత్వం బంగ్లాదేశ్‌ను శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా నడిపిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు, అదే సమయంలో ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ఆకాంక్షలపై భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏర్పడిన లోతైన స్నేహాన్ని భారత ప్రధాని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలు మన మధ్య బలమైన సంబంధాలు, భవిష్యత్ సహకారానికి మార్గదర్శకంగా పనిచేస్తాయని ప్రధాని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.
కాగా, లోక్‌సభ స్పీకర్ బిర్లా మాట్లాడుతూ…”ఢాకాలో ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత దేశాన్ని నిర్మించడానికి బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది” అని బిర్లా Xలో పోస్ట్ చేశారు.
“కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో భారతదేశానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ శుభాకాంక్షలు తెలిపారని భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా Xలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా స్పీకర్ బిర్లా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే , ఇతర నాయకులను కూడా కలిశారు.
రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ …ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో 49.97 శాతం ఓట్లు, 209 సీట్లతో మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జమాతే-ఇ-ఇస్లామి 31.76 శాతం ఓట్లు, 68 సీట్లను గెలుచుకుంది.
బంగ్లాదేశ్ నరేంద్ర మోడీని కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార వేడుకకు ఆహ్వానించింది. కానీ, ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చల కోసం ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

