బెంగళూరు: మూడు దశాబ్దాల క్రితం జరిగిన కునాన్ పోష్‌పురా సామూహిక అత్యాచారంపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఓ సెమినార్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ… అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు నిన్న ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి చొరబడి, ఆస్తులను ధ్వంసం చేసారు. విద్యార్థులు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు వచ్చేలోపు 20 మంది ABVP కార్యకర్తలు ప్రధాన గేటు వెలుపల ఉన్న విశ్వవిద్యాలయ లోగోను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి, నేమ్బోర్డ్కు నల్ల రంగు పూశారు. దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులు 18 మంది నిరసనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.
కాగా, నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసులకు ఈ సంఘటన గురించి ఎటువంటి సమాచారం లేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వారికి రెండు గంటలు పట్టిందని ఒక అధికారి తెలిపారు.
నేపథ్యం
ఈ సంఘటనకు ఓ పోస్టర్ కారణంగా నిలిచింది. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ సిబ్బంది కునాన్ పోష్పురాలో 35 మంది మహిళలపై సామూహిక అత్యాచారం చేసి “35 సంవత్సరాలు గడిచినా, ఒక్క దోషి కూడా శిక్ష పడలేదు… ఇది కాశ్మీర్ ప్రజలపై జరిగిన అనేక హింసాత్మక సంఘటనలలో ఒకటి. కాశ్మీర్‌పై భారత దేశం చేసిన హింసపై చర్చకు మాతో చేరండి” అని రాసివున్న పోస్టర్ కారణంగా ఏబీవీపీ ఘర్షణకు దిగిందని చెబుతున్నారు.
ABVP ఆరోపణ
ఏబీవీపీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారం…ఫిబ్రవరి 23, 1991 నాటి కునన్ పోస్పోరా సంఘటన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని SPARK అనే విద్యార్థి సంస్థ నిర్వహించిన కార్యక్రమం భారత సైన్యాన్ని అవమానించేలా ఉందని వేర్పాటువాద భావజాలాలను ప్రోత్సహిస్తుందని ABVP ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశం నుండి వేరుగా చిత్రీకరించారని నిరసనకారులు ఆరోపించారు.
ఈమేరకు ఏబీవీపీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ పిటిషన్ పంపించింది. సదరు విద్యార్థి సంస్థపై చర్య తీసుకోవాలని, ఈ సంఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. క్యాంపస్‌లో ఇటువంటి కార్యక్రమాలను అనుమతించినందుకు విశ్వవిద్యాలయ అధికారులపై కూడా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
విశ్వవిద్యాలయం ఏం చెప్పింది
“ఫిబ్రవరి 24న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, 20 మంది వ్యక్తుల బృందం బెంగళూరులోని మా క్యాంపస్‌లోకి బలవంతంగా చొరబడింది. వారు నినాదాలు చేశారు, కొంత ఆస్తిని ధ్వంసం చేశారు, మా భద్రతా సిబ్బంది, విద్యార్థులపై దాడి చేశారు. మేము ఈ సంఘటనను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ (సర్జాపూర్)కు నివేదించాము. పోలీసులు వేగంగా చర్య తీసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారని” విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అసలు ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఈ తరహా కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. క్యాంపస్‌లో ఏదైనా కార్యక్రమం నిర్వహించే ముందు విశ్వవిద్యాలయం కఠినమైన నిబంధనలను అనుసరిస్తుంది. కొద్ది మంది విద్యార్థుల బృందం ప్రణాళిక వేసిన ఈ కార్యక్రమం అస్సలు జరగలేదు” అని ప్రకటన పేర్కొంది.
హింసను ఖండిస్తూ, క్యాంపస్‌లో ప్రవేశించి నష్టం, అంతరాయం కలిగించిన ఏబీవీపీ చర్యలను విశ్వవిద్యాలయం తీవ్రంగా ఖండించింది.
విద్యార్థుల ప్రతిఘటన
కాగా, ఏబీవీపీ “మత, ఫాసిస్ట్” దాడికి వ్యతిరేకంగా AISA నిర్వహించిన నిరసనలో యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. కాశ్మీరీ మహిళలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో విద్యార్థులు నిర్వహించబోయే సెమినార్‌ను”ఆపేందుకే” ABVP దాడి జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. క్యాంపస్‌లోకి గుంపు ప్రవేశించకుండా ఆపడంలో లేదా పరిస్థితిని శాంతింపజేయడంలో మొదట్లో అక్కడి పోలీసులు విఫలమయ్యారని కూడా వారు ఆరోపించారు.


