అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తగ్గుతున్న జనన రేటును పెంచడానికి రాయితీలు ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు రూ.25వేలు ప్రోత్సాహాకం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు.
ఈమేరకు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR)ని ప్రస్తుత 1.5 నుండి 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
“మేము ఒక కొత్త పద్ధతిని పరిశీలిస్తున్నాము. ప్రసవ సమయంలోనే రెండవ బిడ్డ లేదా అంతకంటే ఎక్కువ మందిని కలిగి ఉన్న తల్లిదండ్రులకు రూ.25,000 ఇస్తాం. ఇది పెద్ద గేమ్-ఛేంజర్ అవుతుంది. మనం దీన్ని చేయగలిగితే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
జనాభా నిర్వహణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, వృద్ధాప్య జనాభా కారణంగా అనేక దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ముఖ్యమంత్రి గుర్తించారు. మార్చి చివరి నాటికి జనాభా నిర్వహణపై ఒక విధానాన్ని తీసుకువచ్చి ఏప్రిల్ నుండి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అన్నారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమలుచేసేలా ముందుకు వెళ్తామన్నారు. అదే విధంగా.. పాపులేషన్ పాలసీ అమలులో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా చేస్తామన్నారు. అంతేకాదు టీఎఫ్ఆర్ ను 2.1 కు తీసుకెళ్లేలా చూస్తామన్నారు.
రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒకనెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలల పెయిడ్ లీవ్ మంజురు చేస్తామన్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పథంక అమలు చేస్తామన్నారు. ఈ పథకం జనాభా పెరుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. ఇప్పటికే తమిళనాడు , కేరళ జనాభా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, యూపీ , బీహర్లు మాత్రమే కాస్తంత బెటర్ గా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.


