న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారత్ ఎట్టకేలకు సంతాపం వ్యక్తం చేసింది. ఈ హత్యపై ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది.
టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మరణించిన ఆరు రోజుల తర్వాత, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, భారత ప్రభుత్వం తరపున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. మిస్రీ ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలితో కూడా క్లుప్తంగా మాట్లాడారు.
మరోవంక, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఇరాన్ ప్రతినిధి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో మాట్లాడి పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితిని చర్చించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన రెండవ ఫోన్ సంభాషణ ఇది.
“భారత ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక సంతాపం. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రార్థిస్తున్నాము” అని మిస్రి ఖమేనీ మరణంపై సంతాప పుస్తకంలో రాశారు. ఈ సంఘటనను వివాదంపై న్యూఢిల్లీ వైఖరిలో సూక్ష్మ మార్పుకు సంకేతాలుగా చాలా మంది భావిస్తున్నారు.
2024 మే నెలలో జైశంకర్ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించినప్పుడు, అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినందుకు సంతాపం తెలిపేందుకు వస్తే…,ఈసారి సుప్రీం లీడర్ మరణానికి న్యూఢిల్లీ ప్రతిస్పందనను విదేశాంగ కార్యదర్శి ద్వారా నిర్వహించడం గమనార్హం.
ఈ విషయమై గత కొన్ని రోజులుగా, ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ ఖమేనీ హత్యపై మౌనం పాటించడం భారతదేశ విదేశాంగ విధానం విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తిందని అన్నారు.
పశ్చిమాసియా సంక్షోభాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించాలని భారతదేశం పిలుపునిచ్చినప్పటికీ, ఖమేనీ హత్యకు స్పందించలేదు.
తమ దేశంపై సైనిక దాడి తరువాత, ఇరాన్ ప్రధానంగా యుఎఇ, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాతో సహా అనేక గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్,అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.
గత రెండు రోజుల్లో, ఇరుపక్షాల దాడులు, ప్రతిదాడులతో వివాదం గణనీయంగా పెరిగింది, పశ్చిమాసియాలో దీర్ఘకాలిక యుద్ధం జరుగుతుందనే భయాలు రేకెత్తుతున్నాయి.
కాగా, భారతదేశం నిర్వహించిన మిలన్ నావికా విన్యాసాల్లో పాల్గొన్న తర్వాత స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీలంక తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచివేసిన ఒక రోజు తర్వాత ఖమేనీ హత్యపై న్యూఢిల్లీ సంతాపం తెలిపింది.
ఈ దాడిలో కనీసం 87 మంది ఇరాన్ సైనిక సిబ్బంది మరణించారు.
మిలన్ నావికా విన్యాసానికి హాజరుకావడంతో పాటు, గత నెలలో విశాఖపట్నంలో భారత నావికాదళం నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ఈ నౌక పాల్గొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి కూడా ఐఆర్ఐఎస్ దేనా మునిగిపోవడం గురించి ప్రస్తావించారు.
“ఇరాన్ తీరాలకు 2,000 మైళ్ల దూరంలో సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడింది. దాదాపు 130 మంది నావికులను తీసుకెళ్తున్న ఈ నౌకపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అంతర్జాతీయ జలాల్లో ముంచేసారు. ఇది పద్ధతి కాదు. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటాం అని ఆయన అన్నారు.
ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనా నుండి వచ్చిన విపత్తు కాల్ గురించి తెలుసుకున్న తర్వాత భారత నావికాదళం రక్షణ ఆపరేషన్‌లో చేరినట్లు తెలిపింది.
భారత నావికాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ స్పందించారు. “శ్రీలంక దక్షిణ తీరం వద్ద భారీ ప్రాణనష్టంతో ఇరానియన్ యుద్ధనౌకను ముంచివేయడం అర్థరహితమైన చర్యగా అభివర్ణించారు. ఈ అంతులేని సంఘర్షణలో హింస మరొక కోణాన్ని తీసుకోవడం, సముద్రాలలో ఆందోళనను వ్యాపింపజేస్తుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తుంది. ఖండించదగినది!” అని ఆయన సోషల్ మీడియాలో అన్నారు.
భారతదేశం ఆహ్వానం కారణంగా ఇరానియన్ నౌక ఈ జలాల్లో ఉన్నందున అమెరికా భారతదేశం సున్నితత్వాన్ని విస్మరించిందని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ అన్నారు.
“ఈ విన్యాసానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం నౌకలు ఎటువంటి మందుగుండు సామగ్రిని తీసుకెళ్లలేవని నాకు తెలుసు. . ఇరాన్ నావికాదళ సిబ్బంది మన అధ్యక్షుడి ముందు కవాతు చేశారు” అని ఆయన అన్నారు.
“అమెరికా జలాంతర్గామి దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది ఎందుకంటే అమెరికా నావికాదళాన్ని ఈ వేడుకకు అహ్వానించారు. ఇరానియన్ నౌక ఉనికి గురించి అమెరికాకు తెలుసు కానీ చివరి నిమిషంలో యూఎస్ పాల్గొనకుండా వైదొలిగింది, బహుశా ఈ ఆపరేషన్‌ను దృష్టిలో ఉంచుకుని అయి ఉండొచ్చని” ఆయన Xలో అన్నారు.
“అమెరికా దాడికి మేము రాజకీయంగా లేదా సైనికపరంగా చాలా దూరంగా ఉన్నాము. మా ‘బాధ్యత’ నైతిక, మానవీయ స్థాయిలో ఉంది” అని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ అన్నారు.

