హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వచ్చిన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. వీరిపై BRS, BJP దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్టైంది.
స్పీకర్ ఈ ఆరోపణలపై నేడు విచారణ నిర్వహించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు తాము BRS సభ్యులుగానే ఉన్నామని,పార్టీ మారలేదని నొక్కి చెప్పారు. BRS తమకు విప్ జారీ చేయలేదని కూడా వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలనే తన నిర్ణయం వ్యక్తిగతమని, హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని దానం నాగేందర్ పేర్కొన్నారు.
వారి ప్రకటనలను పరిశీలించిన తర్వాత, స్పీకర్ వారిని BRS ఎమ్మెల్యేలుగా గుర్తించి, అనర్హులుగా ప్రకటించలేదు, ఇద్దరికీ ఉపశమనం కల్పించారు. సుప్రీంకోర్టు రేపు గురువారం ఈ కేసును విచారించనుంది. రేపటితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మార్చి 12లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లినట్లుగా గులాబీ పార్టీ ఆరోపిస్తుండటంతో స్పీకర్ ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే మిగితా ఇద్దరి విషయంలో సైతం స్పీకర్ కార్యాలయం క్లీన్‌చిట్ ఇచ్చింది.
