హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989 కింద ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని కోరుతూ ఏడుగురు సభ్యుల ప్రజాభిప్రాయ సేకరణ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.
పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, విద్యావేత్తలతో కూడిన ఈ కమిటీ… ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రాష్ట్రంలో దళితులు, ఆదివాసులపై వ్యవస్థాగతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని వివరించింది.
ఈమేరకు జనవరి 25న, రోజంతా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇందులో 30కి పైగా కేసులను సమీక్షించి, దళితులు, ఆదివాసులపై జరిగిన అఘాయిత్యాలు, బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. “విచారణలో వెల్లడైన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని” ఆ లేఖలో పేర్కొన్నారు.
“FIRలు నమోదు చేయడంలో జాప్యం లేదా నిరాకరణ, ఆధిపత్య కులాలకు చెందిన నిందితులతో రాజీ పడమని ఒత్తిడి చేయడం, చట్టంలోని సంబంధిత నిబంధనలను అమలు చేయడంలో వైఫల్యం, తక్కువ శిక్షా రేట్లకు దారితీసే నాసిరకమైన దర్యాప్తు, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడంలో జాప్యం, అట్రాసిటీల నివారణ (PoA) చట్టం నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన నష్టపరిహారం, సహాయాన్ని పంపిణీ చేయకపోవడం వంటి పోలీసు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని బాధితులు, ప్రాణాలతో బయటపడినవారు ఆరోపించారని” వారు తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నుండి జనవరి 23, 2026 నాటి సమాచార హక్కు చట్టం (RTI) కింద పొందిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, 2024లో ఏ అట్రాసిటీ బాధితుడికి కూడా తప్పనిసరి అయిన ఏడు రోజులలోపు మధ్యంతర సహాయం అందలేదని ప్యానెల్ పేర్కొంది. “ఉద్దేశపూర్వకంగా విధిని నిర్లక్ష్యం చేసినందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనా PoA చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయలేదు, 27 జిల్లాల్లో బాధితులకు ఎలాంటి న్యాయ సహాయ సౌకర్యాలు కల్పించలేదు. ఆ సంవత్సరంలో చట్టంలోని సెక్షన్లు 4,5 కింద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు,” అని ఆ లేఖలో ఉంది.
“రాష్ట్ర, జిల్లా స్థాయిలలో తప్పనిసరి సమీక్షలు లేకపోవడం, అత్యాచార నిరోధక చట్టం (PoA) అమలులో ఉన్న తీవ్రమైన లోపాలను, అలాగే అన్ని స్థాయిలలోని సంస్థాగత వైఫల్యాలను బహిర్గతం చేసింది” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
జీ.ఓ.ఎం.ల ద్వారా ముఖ్యమంత్రి అధ్యక్షతన పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణ కమిటీ… షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఫిబ్రవరి 27, 2025న జారీ చేసిన నెం. 5 కమిటీ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం ప్రకారం… ఈ కమిటీ ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో కనీసం రెండుసార్లు సమావేశం కావాలి.
డిమాండ్లు
ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణ, నష్టపరిహార చెల్లింపులకు నిర్దేశించిన కాలపరిమితులను కఠినంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వోద్యోగులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయ సహాయం అందించాలని, రెండు నెలల్లోగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని, అఘాయిత్యాల కేసులను సున్నితంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వాలని ఈ కమిటీ కోరింది.
ఏకపక్ష తొలగింపులను నివారించడానికి, ఆదివాసీల భూ హక్కులను పరిరక్షించడానికి అటవీ హక్కుల చట్టం, 2006ను వేగంగా అమలు చేయాలని కోరింది. సాక్ష్యాల ఆధారంగా రూపొందించిన వివరణాత్మక విశ్లేషణాత్మక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు.
