హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను మూడు లక్షల కోట్లతో బాహుబలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన చేస్తున్నామన్నారు. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పని చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని.. దేశంలో తెలంగాణను నెంబర్ ఒన్ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతున్నామన్నారు.
బడ్జెట్ అంటే అంకెల గారడి కాదని, గొప్పల కోసం తామేమీ అబద్ధాలు చెప్పడం లేదని విక్రమార్క అన్నారు. సంక్షేమం, అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యమని చెప్పారు. దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని ఆర్థిక మంత్రి అన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7 శాతం ఎక్కువని సభకు తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 2034 నాటికి ఒన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3లక్షల 24వేల 234 కోట్లని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 34వేల 406 కోట్లని, మూలధన వ్యయం రూ.47వేల267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4లక్షల 18వేల 931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20 శాతంగా ఉందన్నారు.
కాగా, బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాదు ఈ బడ్జెట్‌లో విద్యార్థులకు సైతం గుడ్‌న్యూస్ అందించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రెండువేల స్కాలర్‌షిప్ అందిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇక మైనారిటీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో మూడువేల 769 కోట్లు కేటాయించారు.
తెలంగాణ బడ్జెట్‌లో మహిళకు కానుకలు ఇచ్చారు. ఈమేరకు డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు, అందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18 ఏళ్లు పైబడిన, 61 ఏళ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రకటనతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత ఆసుపత్రులతో పాటు 421 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్లరకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది.13వేల679 కోట్లు కేటాయించింది. ఇది తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు అత్యధిక కేటాయింపు కావడం విశేషం. అలాగే, ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయింపు చేశారు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కోటి 15 లక్షల కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా దక్కనుంది.
బడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది.. ఉస్మానియా యూనివర్సిటీకి వేయి కోట్లు కేటాయించింది. 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటికి 400 కోట్లు కేటాయించింది.
అంతేకాదు ప్రపంచవ్యాప్త ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం నైపుణ్య శిక్షణ, భాషా సహాయం, వీసా సహాయం, ప్రయాణ సౌకర్యాలను అందించే ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
