Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘భారత విదేశాంగ విధానం’ రాజీ పడింది…రాహుల్‌గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశ విదేశాంగ విధానం పూర్తిగా బలహీనపడిందని, జాతీయ ప్రయోజనాలకు బదులుగా అది ప్రధాని “వ్యక్తిగత విదేశాంగ విధానం”గా మారిపోయిందని ఆయన ఆరోపించారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ వెలుపల రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ… ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్ట గణనీయంగా మసకబారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాధికారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రపంచ నాయకులకు కూడా అవగాహన ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

“ప్రధానమంత్రే రాజీపడితే, మన విదేశాంగ విధానం కూడా రాజీపడినట్లే. ఈ విషయం అందరికి స్పష్టంగా కనిపిస్తోందని రాహుల్‌ గాంధీ నొక్కి చెప్పారు. మోదీ హయాంలో భారత విదేశాంగ విధానం ‘ఒక జోక్‌గా’ మారిందని అభివర్ణించారు. ఇక పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రసంగం అసంబద్ధంగా ఉందని, దేశ ప్రధాని హోదాకు తగ్గట్లుగా అది లేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

ఇలాంటి రాజీ వైఖరి వల్ల పర్యవసానాలు భయంకరంగా ఉండబోతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారని రాహుల్ హెచ్చరించారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎల్‌పీజీ, పెట్రోల్, ఎరువులు.. ఇలా అన్నింటి ధరలు పెరిగి ప్రజలు నష్టపోతారు” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల రూపంలో త్వరలోనే సామాన్య పౌరులపై పడతాయని ఆయన హెచ్చరించారు.

“కోవిడ్ లాంటి” పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న మోదీ వ్యాఖ్యలకు స్పందిస్తూ… గత సంక్షోభాలు, ప్రాణనష్టంపై ప్రభుత్వానికి ఉన్న అవగాహనను ప్రశ్నిస్తూ, కోవిడ్-19 మహమ్మారిని ప్రభుత్వం నిర్వహించిన తీరును కూడా రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.

పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం పిలిచిన అఖిలపక్ష సమావేశానికి తాను హాజరుకావడం లేదని రాహుల్‌ గాంధీ తెలిపారు. కేరళలో తనకు ముందస్తుగా ఒక కార్యక్రమం ఉన్నందున ఈ సమావేశం వెళ్లడం లేదని ఆయన అన్నారు. అయినప్పటికీ, విస్తృత సంప్రదింపుల ఆలోచనను ఆయన స్వాగతించారు. సులభంగా సరిదిద్దలేని ఒక “నిర్మాణాత్మక పొరపాటు” జరిగిందని ఆయన నొక్కి చెప్పారు.

మోదీ నిర్ణయాలపై బాహ్య నియంత్రణ ఉందని రాహుల్‌ గాంధీ ఘాటుగా ఆరోపించారు: “నేను మీకు రాతపూర్వకంగా చెప్పగలను. అమెరికా, ఇజ్రాయెల్ ఏది కోరితే అది ప్రధాని మోదీ చేస్తారు. ఆయన ఎన్నడూ భారతదేశ ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేరు. అవి రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండవు.”

“ప్రధానమంత్రి స్వయంగా రాజీపడటం వల్లే నేడు దేశ విదేశాంగ విధానం దెబ్బతింది. అమెరికా, ఇజ్రాయెల్ కోరుకున్నది మాత్రమే మోదీ చేస్తారని” రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో రాశారు.

పశ్చిమ ఆసియా సంఘర్షణతో సహా కొనసాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో విపక్షనేత రాహుల్‌ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు, పార్లమెంటులో రాజకీయ చర్చను తీవ్రతరం చేశాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.