వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేడు 34వ రోజులోకి ప్రవేశించింది. అయితే యుద్ధ విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. మేము ఇరాన్‌నుంచి తొందరగా వైదొలగమని ట్రంప్ అన్నారు. వాషింగ్టన్ తన సైనిక చర్యను ముందుకు తీసుకువెళ్తుందని ప్రతిజ్ఞ చేశారు.
ఈమేరకు కెంటకీలోని హెబ్రాన్‌లో ట్రంప్ మాట్లాడుతూ… అన్ని లక్ష్యాలు సాధించే వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని నొక్కిచెప్పారు. అమెరికా ఈ సంఘర్షణను ఉన్నపళంగా ముగించదని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచి, స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ నౌకల రాకపోకలను అడ్డుకుంటే బాంబుల వర్షంతో ఇరాన్‌ను రాతియుగం నాటి దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
గత సంఘర్షణల కంటే కార్యకలాపాలు వేగంగా పురోగమిస్తున్నాయని, కీలక లక్ష్యాలు పూర్తి కావడానికి దగ్గరలో ఉన్నాయని ట్రంప్ అన్నారు. “ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ” కొనసాగుతుందని ట్రంప్ ధృవీకరించారు, ఇటీవలి వారాల్లో అమెరికా దళాలు యుద్ధభూమిలో గణనీయమైన విజయాలు సాధించాయని కూడా తెలిపారు.
ఇరాన్ నావికా దళాలను నిర్వీర్యం చేశామని, దాని వాయుసేనను తీవ్రంగా బలహీనపరిచామని, క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని అరికట్టామని, వాషింగ్టన్ “మునుపెన్నడూ లేనంత పెద్ద విజయాన్ని సాధిస్తోందని” ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ అణు స్థావరాలపై నిరంతర నిఘా ఉందని, ఏ మాత్రం కదలిక కనపడినా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. రహస్య మార్గాల ద్వారా అణు సామర్థ్యాలను సాధించేందుకు టెహ్రాన్ ప్రయత్నాలు కొనసాగిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ విమర్శిస్తూ, అది ఒక పొరపాటని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై గతంలో అమెరికా జరిపిన దాడులను ఆయన ప్రస్తావించారు.
హార్ముజ్ జలసంధిని తెరిపిద్దామని మిత్రదేశాలకు అమెరికా విజ్ఞప్తి
అమెరికా చమురు దిగుమతులపై ఆధారపడదని, మధ్యప్రాచ్య సరఫరాలపై ఆధారపడిన దేశాలు హార్ముజ్ జలసంధిని తెరిపిపంచే బాధ్యతను తీసుకోవాలని ట్రంప్ కోరారు. వాషింగ్టన్ తన భాగస్వాములకు మద్దతు ఇస్తుందని, అయితే వారే ముందుండి నడిపించాలని ఆశిస్తున్నామని, అదే సమయంలో అమెరికా చమురును ఒక ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ఆయన అన్నారు.
అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను ట్రంప్ అంగీకరించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పెట్రోల్ ధరలు 25 శాతానికి పైగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ పెరుగుదల తాత్కాలికమైనదని, వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేపట్టిన చర్యలే దీనికి కారణమని ఆయన అభివర్ణించారు. దీని ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందని కూడా ఆయన తెలిపారు.
ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ సంకేతాలు
అన్ని లక్ష్యాలు సాధించే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని, పురోగతిని బట్టి ఆ లక్ష్యాలను త్వరలోనే చేరుకోవచ్చని ట్రంప్ అన్నారు. రాబోయే వారాల్లో దాడులు తీవ్రతరం అవుతాయని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే, విద్యుత్ కేంద్రాలపై దాడులతో సహా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన అన్నారు. సంఘర్షణ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా మరింత బలపడిందని ట్రంప్ అన్నారు
ఇరాన్ “అణు బెదిరింపుల భూతం” నుండి అమెరికన్లకు ఇకపై ముప్పు లేదని, అమెరికా “మరింత సురక్షితంగా, బలంగా, సంపన్నంగా” ఆవిర్భవిస్తుందని ట్రంప్ అన్నారు. తన ప్రసంగాన్ని ముగించే ముందు, ఈ సంఘర్షణలో మరణించిన 13 మంది అమెరికన్ సైనికులకు ట్రంప్ నివాళులర్పించారు. ఇజ్రాయెల్,గల్ఫ్ దేశాలతో సహా ప్రాంతీయ మిత్రదేశాలకు అమెరికా మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ కొత్త క్షిపణి దాడి
ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించిన కొద్దిసేపటికే, ఇరాన్ నుండి కొత్త క్షిపణి ప్రయోగాలు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం నివేదించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దాడి సమయంలో వైమానిక రక్షణ వ్యవస్థలు దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకుంటోంది.
అంతకుముందు, ఇరాన్ ఇజ్రాయెల్ వైపు ఒక క్లస్టర్ క్షిపణిని ప్రయోగించగా, దాని శకలాలు టెల్ అవీవ్‌లోని పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం, గాయాలు, నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికన్లకు ఇరాన్ అధ్యక్షుడు సందేశం
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికన్ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసారు. ఇరాన్ ఎలాంటి దురాక్రమణకు పాల్పడలేదని, తన చర్యలను ఆత్మరక్షణ కోసమేనని ఆయన అన్నారు. అదే సమయంలో, ఘర్షణలు కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత సైనిక చర్యలు, ఆంక్షలతో సహా అమెరికా విధాన నిర్ణయాలను కూడా విమర్శించారు. ఉద్రిక్తతలను పెంచడం కంటే చర్చలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు.


