వరంగల్: కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈమేరకు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిధిలోని రైతులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సంగేం గ్రామ నిర్వాసితులైన 186 మంది రైతులకు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన 50 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇప్పుడు 75 గజాలకు పెంచిందని, భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ టౌన్షిప్లో రూ. 80 కోట్లతో పాఠశాల, ఆసుపత్రి, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, నిర్వాసిత కుటుంబాల్లోని అర్హులకు టెక్స్టైల్ పార్క్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాదు రాజీవ్ గాంధీ టౌన్షిప్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) క్లస్టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. టౌన్షిప్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ లేఅవుట్లు, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ పురోగతికి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రులతో సమన్వయం అవసరమని, ఇది ఊపందుకుందని ఎమ్మెల్యే అన్నారు. నిర్వాసిత కుటుంబాలలోని అర్హులైన సభ్యులకు టెక్స్టైల్ పార్క్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రేవూరి ప్రకాష్‌రెడ్డి తెలిపారు.

