వాషింగ్టన్: గడువు ముగిసేలోపు టెహ్రాన్ వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందానికి రాలేకపోతే ‘మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ట్రంప్ బెదిరించారు. దీనికి ఇరాన్ ధీటుగా స్సందించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ హెచ్చరించింది.
యాక్సియోస్ నివేదిక ప్రకారం, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్, పలు ప్రాంతీయ మధ్యవర్తుల బృందం నిబంధనలపై చర్చిస్తున్న తరుణంలో ఈ హెచ్చరిక వెలువడింది.
ట్రంప్ ఏమన్నారు
అమెరికన్ మీడియా సంస్థలకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో ట్రంప్ మాట్లాడుతూ, రాబోయే 48 గంటల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే, “మొత్తం దేశాన్ని పేల్చేస్తాం” అని అన్నారు. “మంచి అవకాశం ఉంది, కానీ వారు ఒప్పందం చేసుకోకపోతే, నేను అక్కడ ఉన్న ప్రతిదాన్నీ పేల్చేస్తానని ఆయన అన్నారు. ఇరాన్ “పూర్తిగా నాశనమైపోయింది” అని అధ్యక్షుడు పేర్కొన్నారు.
“ప్రతిరోజూ వారు మరిన్ని వంతెనలు, మరిన్ని విద్యుత్ కేంద్రాలు నిర్మించాల్సి ఉంటుంది,” అని ఆయన ఏబీసీ న్యూస్‌తో అన్నారు. “ఇంతటి దెబ్బను ఇంతకుముందెన్నడూ ఏ దేశమూ చవిచూడలేదు.”
అమెరికా దాడుల వల్ల భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతారన్న ఆందోళనలను కూడా యూఎస్ కమాండర్-ఇన్-చీఫ్ కొట్టిపారేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రజలు, ఆ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ఇటువంటి దాడులకు మద్దతు ఇస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన అన్నారు. “వారు భయంతో బతుకుతున్నారు. మేము యుద్ధం మధ్యలో వదిలి వెళ్ళిపోతామని వారు భయపడుతున్నారు, కానీ మేము అలా వెళ్ళిపోము,” అని ఆయన ఆక్సియోస్‌తో అన్నారు.
సంధికి ఆస్కారం లేదు
హర్ముజ్ జలసంధిని తెరవడానికి బదులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావడానికి, గత రెండు వారాలుగా వాషింగ్టన్,టెహ్రాన్- పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీల ద్వారా పరోక్ష చర్చలు జరిపాయి, కానీ ఎటువంటి పురోగతి లేదు.
యాక్సియోస్ నివేదిక ప్రకారం, త్వరలో ఒప్పందం కుదురుతుందని మధ్యవర్తులు అంత ఆశాజనకంగా లేనప్పటికీ, ట్రంప్ అల్టిమేటమ్‌ను ఆలస్యం చేయడానికి కనీసం పాక్షిక ఒప్పందానికైనా చర్చలు జరిపేందుకు చివరి నిమిషం వరకు కృషి చేస్తామని వారు తెలిపారు.
ట్రంప్ బెదిరింపు
ఇరాన్ నాయకులతో ఒప్పందం కుదరకపోతే, అక్కడి పౌరులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని ట్రంప్ బెదిరించారు.
“మంగళవారం ఇరాన్ ‘పవర్ ప్లాంట్ డే’, ‘బ్రిడ్జ్ డేగా ఉండబోతోంది. ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఆ జలసంధిని తెరవండిరా పిచ్చి వెధవల్లారా, లేకపోతే నరకంలో బ్రతుకుతారు – చూస్తూ ఉండండి!” అని పోస్ట్ చేశారు.
ఇరాన్ హెచ్చరిక
ట్రంప్ అల్టిమేటమ్‌కు ప్రతిస్పందనగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందిస్తూ, “మీ నిర్లక్ష్యపు చర్యలు అమెరికాలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని నరకంలోకి నెడుతున్నాయి” అని అన్నారు. అంతేకాకుండా, ట్రంప్ “నెతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని” ఆరోపించారు.ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించాలని, ఈ ప్రమాదకరమైన ఆటను ముగించాలని” కూడా ఘాలిబాఫ్ పిలుపునిచ్చారు.


