టెహ్రాన్: కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని కోరుతూ పది-సూత్రాల డిమాండ్లను పంపినట్లు అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది.
ఈమేరకు టెహ్రాన్ పాకిస్థాన్ ద్వారా వాషింగ్టన్‌కు తన వైఖరిని నిన్న తెలియజేసింది. కాగా, ఈ డిమాండ్లలో ఈ ప్రాంతంలోని అన్ని సంఘర్షణలకు ముగింపు పలకడం, హర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్, ఆంక్షలను ఎత్తివేయడం, పునర్నిర్మాణానికి కట్టుబడి ఉండటం వంటి డిమాండ్లు ఉన్నాయని ఐఆర్ఎన్ఏ నివేదించింది.
45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను వాషింగ్టన్ సమీక్షించిందని, ఇది సరిపోకపోయినా ఒక ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “ఇది ఒక ముఖ్యమైన ప్రతిపాదన, ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఇది సరిపోదు, కానీ ఇది చాలా ముఖ్యమైన అడుగు” అని ఆయన వైట్ హౌస్‌లో విలేకరులతో అన్నారు. మధ్యవర్తులు చర్చలు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వంపై తాను అసంతృప్తిగా ఉన్నానని, అందుకు వారు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారని ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ వార్షిక ఈస్టర్ ఎగ్ రోల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ…”మొదటి పాలనను తొలగించారు, రెండవ పాలనను తొలగించారు. ఇప్పుడు మనం వ్యవహరిస్తున్న మూడవ వర్గం ప్రజలు అంత తీవ్రవాదులు కాదు, వారు నిజానికి మరింత వివేకవంతులని మేము భావిస్తున్నామని” అన్నారు.
ఆదివారం, అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఇరాన్‌కు ఒక అల్టిమేటం జారీ చేశారు. హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఆ దేశానికి ఆయన “మంగళవారం, తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటల” గడువు విధించిన విషయం తెలిసిందే.
బూతులతో నిండిన మరో పోస్ట్‌లో, ఆ జలమార్గం మూసివేసే ఉంటే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అధ్యక్షుడు హెచ్చరించారు.
“మంగళవారం ఇరాన్‌లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజున జరగనున్నాయి! ఇలా మునుపెన్నడూ జరగలేదు!!! ఓరి పిచ్చి వెధవల్లారా, ఈ దరిద్రపు జలసంధిని తెరవండి, లేకపోతే నరకానికి పోతారు – చూస్తూ ఉండండి! దేవుడికి స్తోత్రం అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.”
సోమవారం కూడా ట్రంప్ ఈ హెచ్చరికను పునరుద్ఘాటించారు. అమెరికా అధినేత గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు; తరచుగా మధ్యవర్తులు పరస్పర అంగీకారంతో సంఘర్షణను ముగించే దిశగా పురోగతి సాధించామంటూ… ట్రంప్ గడువును పొడిగించారు.

