టెహ్రాన్: అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, ఇరాన్ అధినేత మొజ్తబా ఖమేనీ తన సైన్యాన్ని కాల్పులు ఆపాలని ఆదేశించారు. అయితే “ఇది యుద్ధానికి ముగింపు కాదని” స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ (IRIB)లో చదివి వినిపించిన ఒక ప్రకటనలో…”ఇది యుద్ధానికి ముగింపు కాదు, కానీ సైనిక విభాగాలన్నీ సర్వోన్నత నాయకుడి ఆదేశాన్ని పాటించి, కాల్పులు నిలిపివేయాలి అని ఖమేనీ పేర్కొన్నారు.”
“మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని” ఇరాన్ హెచ్చరిక
కాల్పుల విరమణ అంటే యుద్ధం ముగిసినట్లు కాదని, శత్రువులు—అమెరికా లేదా ఇజ్రాయెల్—ఏ విధంగానైనా వ్యవహరిస్తే ఎదుర్కోవడానికి తమ చేతులు ట్రిగ్గర్‌పైనే సిద్ధంగా ఉంటాయని ఇరాన్ స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ ప్రకటన తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి ఇలా పేర్కొంది: “ఇది యుద్ధం ముగిసినట్లుగా భావించకూడదని నొక్కి చెబుతున్నాము… మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి; శత్రువులు కనీసం చిన్న పొరపాటు చేసినా, దానికి పూర్తి బలంతో తగిన సమాధానం ఇస్తామని అన్నారు.”
ఇరాన్ 10-సూత్రాల ప్రతిపాదన
ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్ ఇరాన్‌పై సంయుక్త దాడిని ప్రారంభించాయి; యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. గత 39 రోజులుగా సాగుతున్న ఈ సంఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, తమ దేశ ప్రజలు చేసిన త్యాగాలకు ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి కృతజ్ఞతలు తెలిపింది: “యుద్ధ లక్ష్యాలన్నీ దాదాపుగా నెరవేరాయని, మీ ధైర్యవంతులైన బిడ్డలు శత్రువులను చారిత్రక నిస్సహాయ స్థితికి, శాశ్వత ఓటమికి నెట్టేశారని ఇరాన్ అనే గొప్ప దేశానికి మేము ఇప్పుడు శుభవార్త తెలియజేస్తున్నామని పేర్కొంది.”
అమెరికా కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌కు 15-సూత్రాలను పంపింది; దీనికి ప్రతిగా చర్చలకు ప్రాతిపదికగా ఇరాన్ సవరించిన 10-సూత్రాల ప్రతిపాదనను పంపింది. హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించడం, అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం, తమపై ఎలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా ఉండటం వంటి 10 పాయింట్లను ఇరాన్ ప్రతిపాదించింది. కాగా, ఈ ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది.
“10-అంశాల ప్రణాళికలో నిర్దేశించిన సూత్రాలను అంగీకరించినట్లయితే,” చర్చలలో వివరాలు ఖరారైన తర్వాత యుద్ధ ముగింపును తాము అంగీకరిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని, ఇరుపక్షాల అంగీకారం ఆధారంగా పొడిగింపునకు లోబడి ఈ చర్చలు రెండు వారాల పాటు కొనసాగుతాయని టెహ్రాన్ ధృవీకరించింది.
“ఈ కాలంలో, సంపూర్ణ జాతీయ ఐక్యతను కాపాడుకోవడం, విజయ వేడుకలను బలంగా కొనసాగించడం అత్యవసరం,” అని ఇరాన్ పేర్కొంది.

