భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి ఏటా ఏప్రిల్ 14న ఆ మహనీయుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును ‘సమానత్వ దినోత్సవం’గా కూడా పిలుస్తారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, దళితుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడిగా చిరస్మరణీయులు.
మధ్యప్రదేశ్‌లోని మహౌ (MHow) ప్రాంతంలో 1891లో జన్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్… భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. చిన్నప్పటి నుంచే అంబేద్కర్ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. అస్పృశ్యత, జాతి వివక్ష వంటి సమస్యలు ఆయన జీవితంలో పెద్ద అడ్డంకులుగా నిలిచాయి. పాఠశాలలో కూడా ఇతర పిల్లలతో సమానంగా ఉండలేకపోయారు. అయినా కూడా ఆయన చదువుపై ఆసక్తిని కోల్పోలేదు. కష్టపడుతూ ఉన్నత విద్యను సాధించారు. విదేశాల్లో కూడా చదువుకుని, గొప్ప విద్యావంతుడిగా ఎదిగారు. కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్లు పొందిన మొదటి భారతీయుడు. విద్య ద్వారా దళితులు ఎదగాలని ఆయన బోధించారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశారు. కానీ కుల వ్యత్యాసాల వల్ల రాజీనామా చేశారు. ముంబైలో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా పనిచేశారు. 1924లో “బహిష్కృత హితకారిణి సభ” స్థాపించి దళితుల విద్య, ఆరోగ్యం, సామాజిక హక్కుల కోసం కృషి చేశారు. 1927లో మహద్ సత్యాగ్రహం నిర్వహించి, అంటరాని వారికి నీళ్లు తాగే హక్కు కోసం పోరాడారు. 1930లో నాగపూర్‌లో కాలారామ మందిర ప్రవేశ సత్యాగ్రహం చేశారు. 1932లో పూనా ప్యాక్ట్ ద్వారా దళితులకు ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. “మూక్‌నాయక్”, “బహిష్కృత భారత్”, “జనతా” వంటి పత్రికలు ప్రచురించి సామాజిక స్పృహ కల్పించారు. స్వతంత్ర లేబర్ పార్టీ స్థాపించి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 1947లో స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయ శాఖా మంత్రిగా నియమితులయ్యారు
ఇక భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన మనదేశానికి అపూర్వ సేవ చేసారు. రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలను దేశానికి అందించారు. ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ ప్రపంచంలోనే అతి ప్రగతిశీలమైనదిగా ప్రశంసలు అందుకుంటోంది. ఎన్ని సవరణలు చేసినా, మూల సూత్రాలను మార్చట్లేదు. ఆయన కృషి వల్లే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా నిలిచింది.
అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు. దళితుల హక్కులు, మహిళల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం కూడా ఆయన పోరాడారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఆయన ఆలోచనలు ఇప్పటికీ చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. సామాజిక న్యాయ యోధుడిగా ఆయన చేసిన అజరామరం. అస్పృశ్యత, కుల వ్యవస్థపై ఆయన తీవ్రంగా పోరాడారు. మహద్ సత్యాగ్రహం ద్వారా నీటి హక్కుల కోసం దళితులను ఐక్యం చేశారు. ఆయన పోరాటం వల్ల.. దేశంలో అంటరానితనంపై నిషేధం రాజ్యాంగం ద్వారా అమలైంది. 1956 డిసెంబర్ 6న ఢిల్లీలోని తన నివాసంలో 65 ఏళ్ల వయసులో మరణించారు.
మొత్తంగా అంబేద్కర్ జీవితం మనందరికీ ఓ గొప్ప స్ఫూర్తి. కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించారు. సమానత్వం, న్యాయం, గౌరవం కోసం ఆయన పోరాటం ఇప్పటికీ మనకు ప్రేరణనిస్తాయి. ఆయన వారసత్వం…సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న వారందరికీ ప్రేరణ. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు, స్మారకాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆయన రచనలు, ప్రసంగాలు ఇప్పటికీ లక్షలాది మందికి మార్గదర్శకం.
మన హక్కులను కాపాడుకోవడానికి, సమాజంలో సమానత్వం సాధించడానికి ఆయన మనకు అందించిన రాజ్యాంగమే మన ఆయుధం. దానిని పరిరక్షించుకోవడం మనందరి కనీస బాధ్యత.
మూగ జీవాల్లా బలైపోకుండా.. ఎవరికీ భయపడకుండా, ఆత్మగౌరవంతో, ఎలుగెత్తి ప్రశ్నించే ధైర్యంతో బ్రతకాలని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ మహా దార్శనికుడు చూపిన మార్గంలో నడుస్తూ, అసమానతలు లేని నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.


