న్యూఢిల్లీ: రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా నియమితులైన కొద్ది రోజులకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్‌కు సంబంధించిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు దాడులు నిర్వహించింది. పార్లమెంటులో రాఘవ్ చద్దా స్థానంలో మిట్టల్ నియమితులయ్యారు.
నివేదికల ప్రకారం… దాడులు జరుగుతున్న ప్రదేశాలలో పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఉంది. మిట్టల్ లవ్లీ గ్రూప్ యజమాని, ఈ విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపకుడు, ఛాన్సలర్. ఆయన సోదరులు రమేష్, నరేష్ ఈ విశ్వవిద్యాలయానికి సహ-యజమానులు.
ఆప్ 10 మంది ఎంపీలలో ఒకరైన మిట్టల్, 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రక్షణ, ఆర్థిక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు.
మిట్టల్ ఆస్తులపై ఇప్పుడు ఎందుకు దాడులు జరుగుతున్నాయో డైరెక్టరేట్ అధికారికంగా వెల్లడించలేదు. “ఫెడరల్ ఏజెన్సీ స్థానిక పోలీసుల నుండి ఎటువంటి సహాయం కోరలేదని” పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక అధికారి హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపినట్లు ఉటంకించారు.
కాగా, గత 10 సంవత్సరాలలో రాజకీయ నాయకులపై నమోదైన 190కి పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులలో, కేవలం రెండింటిలో మాత్రమే శిక్ష పడిందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం పార్లమెంటులో తెలిపింది.
ఈ విషయమై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… “మోదీజీ పంజాబ్‌లో ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించారు. కానీ పంజాబ్ ప్రజలు దీనిని సహించరు. వారు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారని అన్నారు.”


